కరోనా కట్టడిపై ఐక్యంగా పోరాడుదాం

మానవాళి విపత్తు కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాను ఆరికట్టేందుకు విరాళాల ద్వారా చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. మంత్రి హరీశ్ రావు గారి పిలుపు మేరకు సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కళింగ బ్రీడ్స్ ఫార్మర్ పరిశ్రమ ప్రతినిధి కే. సురేందర్ రెడ్డి రూ.5 లక్షల రూపాయల విరాళం అందించినట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా సిద్ధిపేటకు చెందిన హెచ్ పీ గ్యాస్ డీలర్ మహేశ్ – అప్పు కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తూ.., తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1లక్ష రూపాయల విరాళాన్ని అందించారని మంత్రి పేర్కొన్నారు. వీరిని స్ఫూర్తి దాయకంగా తీసుకుని మరింత పెద్ద మనస్సుతో దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సిద్ధిపేటలో కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

లాక్ డౌన్ నేపథ్యంలో నిరు పేదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అండగా నిలుస్తున్నారు.
సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో సోమవారం సాయంత్రం పట్టణానికి చెందిన 110 మంది తెనగలు, ఫకీర్లు, లింగారెడ్డిపల్లికి చెందిన 20 మంది ఆటో కార్మిక కుటుంబాలకు మంత్రి చేతుల మీదుగా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

పట్టణ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో.. 500 మంది పేదలకు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ

పేదలకు, ఆకలితో ఉన్న వారికి సాయం చేస్తే లభించే ఆనందం ప్రపంచంలోనే మరొకటి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మార్కండేయ దేవాలయంలో సోమవారం సాయంత్రం పద్మశాలి నిరుపేదలకు కరోనా విపత్కర సహయార్థం సిద్ధిపేట పట్టణ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 500 మంది పేదలకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఏ సంఘమైనా పేదవారికి అండగా ఉండాలని, లాక్ డౌన్ సందర్భంగా చేనేత కార్మికులకు పని లేకుండా పోయిందని మా వంతు సాయంగా మేమున్నామని పద్మశాలి సమాజం ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.