కరోనా వైరస్ మందుబాబులకు చుక్కలు చూపిస్తోంది. కరోనా వైరస్ కారణంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటుంటే తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో మందుబాబులకు చుక్క దొరక్క పిచ్చెక్కిపోతోంది. కరోనా వైరస్ పోరులో విధించిన లాక్డౌన్తో మద్యం, కల్లు దొరక్క మతిస్థిమితం కోల్పోయి చిత్రవిచిత్రాలు, పిచ్చివాళ్లలా, వింతగా, వ్యధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కరోనాతో లాక్ డౌన్ ఉండటంతో సామాజికదూరం పాటించాలని, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవద్దని ప్రధాని, ముఖ్యమంత్రులు దండం పెట్టి చెబుతున్నా జనం పెడచెవిన పెడుతున్నారు. ఆల్కహాల్, కల్లు, సారా దొరక్క వ్యసనపరులు అల్లాడిపోతున్నారు. మందు చుక్క పడక కొందరికి కాళ్లు, చేతుల్లో వణుకుతుంటే, మరికొందరికి మతిస్థిమితం తప్పుతోంది.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటినుంచి రోగుల సంఖ్య పెరిగిందని ఆస్పత్రిలోని డాక్టర్లు చెబుతున్నారు. మతి స్థిమితం కోల్పోయి ఆస్పత్రిలో చేరుతున్నవారిలో ఎక్కువమంది మద్యం దొరక్క మతిపోయిన వ్యక్తులున్నారు. మద్యం తాగని ఈ బతుకు ఎందుకని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం
ఓ గంటైనా మద్యం షాపులు, కల్లు దుకాణాలు తెరవాలని మందుబాబులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కల్లు తాగకుంటే ప్రాణాలు పోవని, కరోనా వస్తే మీరు గాల్లో కలిసి పోవడమే కాకుండా తోటి వ్యక్తులు చనిపోతారని చీవాట్లు పెట్టారు. అయితే తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలోనూ ఇదేస్థితి. అక్కడ కూడా మద్యం ప్రియులు ఆల్కహాల్ దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటుండంతో రాష్ట్ర సీఎం పినరయి విజయన్ జాలితో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు మద్యం అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తప్పు పట్టింది. మందుబాబులు మతిస్థిమితం కోల్పోతే వారికి చికిత్స చేయించాలి తప్పితే, ఇలా మందు అమ్మకూడదని ఆక్షేపించింది. అయితే మద్యం విక్రయాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ది గ్రేట్ అని చెప్పవచ్చు. కానీ రాబోయే రోజులు ఎలా ఉంటాయోనని అందరిలో ఆందోళన నెలకోనుంది.