నెలరోజుల్లో స్థానిక ఎన్నికలు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

నెలరోజుల్లో స్థానిక ఎన్నికలు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి


నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఇవాళ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈనెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని సీఎం గుర్తుచేశారు. నగదు, మద్యం పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతోనే ఆ ఆర్డినెన్స్‌ తెచ్చామన్నారు. నగదు పంపిణీ చేసినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా అనర్హత వేటు వేస్తామని. రెండు, మూడేళ్లు వారికి జైలు శిక్ష పడుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీలు నగదు, మద్యాన్ని అరికట్టాలని.. స్థానిక ఎన్నికలను పోలీసు యంత్రాంగం ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సీఎం ఆదేశించారు.
ఎక్కడా నగదు, మద్యం పంపిణీ చేశారన్న మాట రాకూడదన్నారు.

ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి రూ.కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదని. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే వ్యక్తులే ఎన్నికవ్వాలని సీఎం ఆకాంక్షించారు. అందుకే పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేశామని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలన్నారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి ఉపయోగించిన మాదిరిగానే ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని జగన్‌ ఆదేశించారు. గ్రామాల్లో ఉండే పోలీస్‌ మిత్రలు, సచివాలయాల్లో ఉండే మహిళా మిత్రలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద ఈ యాప్‌ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.