లాక్ డౌన్2 అంశంపై CM KCR ఏమంటున్నారు?

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కట్టడిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంతమందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి, వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 514 మందికి చికిత్స అందిస్తున్నట్లు, వీరిలో ఇవాళ 8 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. గురువారం మరో 128 మంది డిశ్చార్జి కానున్నట్లు రాష్ట్రంలో కరోనా వైరస్ తాజా పరిస్థితి గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రితో జరిగిన కరోనా సమీక్ష సమావేశంలో వివరించారు.

లాక్ డౌన్ అమలును, పేదలకు అందుతున్న సాయాన్ని, పంటల కొనుగోలు విధానాన్ని రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు ఎంతో చొరవ తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. ఈ పని ఇంకా కొనసాగాలి. ప్రజలను చైతన్య పరచాలి. ప్రజలు కూడా లాక్ డౌన్ కు రానున్న రోజుల్లో ఇలాగే సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాం. 10 లక్షల PPE కిట్లు N95 మాస్కులు సమకూరుస్తున్నాము. టెస్టింగ్ కిట్స్, వెంటిలేటర్లు, సరిపడా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లకు చికిత్స చేయడానికి సర్వసన్నద్ధం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందించే కార్యక్రమం దాదాపు పూర్తయింది. ప్రతీ పేద కుటుంబానికి రూ.1500 చొప్పున లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశామని తెలిపారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన ప్రత్యేక నగదు ప్రోత్సాహం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా అందజేశామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న సాయం, లాక్ డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.