రాధేశ్యామ్ లవ్లీ లుక్ విడుదల

రాధేశ్యామ్ లవ్లీ లుక్ విడుదల

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తన అభిమానులకు ఉగాది గిఫ్ట్ ను అందించారు. ప్రస్తుతం పూజా హెగ్డే హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ ‘రాధేశ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తామంటూ, గత కొంతకాలంగా నిర్మాతలు చెబుతూనే ఉండగా, వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కనీసం ఉగాదికైనా విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ ఇటీవలి కాలంలో డిమాండ్ చేస్తుండటంతో, ఈ ఉదయం ప్రభాస్ లవ్లీ లుక్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘ఎన్నో పండగలు… కానీ ప్రేమ ఒకటే’ అంటూ ఇది విడుదలైంది. ఇక ఈ పోస్టర్ లో ప్రభాస్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. దీనికి క్యాప్షన్ గా కొత్త సంవత్సరం ఆరంభం రోజున ఏ భాషలో ఎలా పిలుస్తారో చెప్పారు. ఉగాది, గుడీ పడవా, బైసాకి, వైషు, పుత్తాండు, జుర్ షీతల్, చెట్టి చాంద్, బోహగ్ బిహు, నవ్ రేహ్, పోయిలా బోషక్ అంటూ… వివిధ భాషల్లో ఉగాదిని గుర్తు చేస్తూ, శుభాభినందనలు తెలిపారు.కాగా, ఈ చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, విక్రమాదిత్య పాత్రలో నటిస్తుండగా, కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి జూలై 30న చిత్రాన్ని విడుదల చేస్తామని తేదీని కూడా ప్రకటించినా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడుతుండగా, ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.