శస్త్ర చికిత్స చేయించుకోనున్న మహేశ్‌బాబు!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఊహాగానాలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఆగడు సినిమా షూటింగ్‌ సమయంలో మహేశ్‌బాబు మోకాలికి గాయమైంది. అయితే దానికి శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినప్పటికీ.. మహేశ్‌ దాన్ని తేలికగా తీసుకున్నాడట. ‘స్పైడర్‌’ చిత్రం తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించినప్పటికీ ఎక్కువ కాలంపాటు సినిమాలకు విరామం ఇవ్వాల్సి వస్తుందని మహేశ్‌ ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న మహేశ్‌ సర్జరీకి ఇదే సరైన సమయమని భావించినట్టు సమాచారం. ఈ క్రమంలో కుటుంబంతో సహా న్యూయార్క్‌కు వెళ్లిన మహేశ్‌ శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడని కొన్ని కథనాలు వెలువడ్డాయి.

ఈ నెల చివర్లోనే మహేశ్‌ మోకాలికి సర్జరీ చేయించుకోనున్నారని ఆ వార్తల సారాంశం. అదేగనుక నిజమైతే మహేశ్‌ మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోక తప్పదు. దీంతో మన సూపర్‌స్టార్‌ తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్‌ చెప్పాల్సిందే. అయితే మహేశ్‌ తన శస్త్రచికిత్సను అమెరికాలో చేయించుకుంటాడా, లేక హైదరాబాద్‌లో చేయించుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేశ్‌ భాగస్వామి నమ్రత శిరోద్కర్‌ సైతం మహేశ్‌ తన సినిమాలకు కాస్త విరామాన్నిస్తున్నట్లు తెలిపింది. రెండు సంవత్సరాలపాటుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న మహేశ్‌ కొంతకాలం తన పిల్లలకు సమయం కేటాయించేందుకే సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. కాగా మహేశ్‌బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే..!