సీబీఐ అధికారులు రాకముందు మేనల్లుడి ఇంటికి మమత

సీబీఐ అధికారులు రాకముందు మేనల్లుడి ఇంటికి మమత

కోల్ స్కాంలో ఇటీవలే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీకి సీబీఐ అధికారులు నోటీసులు పంపడం తెలిసిందే. తాజాగా, రుజిరా బెనర్జీని ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు. కోల్ కతాలోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు గంట పాటు సీబీఐ అధికారులు రుజిరా బెనర్జీని ప్రశ్నించారు. అంతకుముందు, సీఎం మమతా బెనర్జీ తన మేనల్లుడి నివాసానికి రావడం ప్రాధాన్యత సంతరిచుకుంది. సీబీఐ అధికారులు రాకముందే మమత రావడం, పది నిమిషాల పాటు అక్కడే గడపడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే కేంద్రంతో పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ స్పర్ధలు తీవ్రరూపు దాల్చాయి. తమను రాజకీయంగా దెబ్బతీసేందుకే సీబీఐని ఉపయోగించుకుంటున్నారని మమత వర్గం విమర్శిస్తోంది.