టోర్నీ నుండి మార్ష్ అవుట్

టోర్నీ నుండి మార్ష్ అవుట్

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రోజు మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తూ గాయపడిన ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ టోర్నీకి పూర్తిగా దూరమయ్యాడు.ఇక మార్ష్ స్థానాన్ని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్‌తో భర్తీ చేయనున్నారు. హోల్డర్ త్వరలోనే జట్టులో చేరనున్నాడు. ‘‘గాయం కారణంగా మిచెల్ మార్ష్ టోర్నీకి దూరమయ్యాడు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మార్ష్ స్థానాన్ని జాసన్ హోల్డర్ భర్తీ చేయనున్నాడు’’ అని సన్‌రైజర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐదో ఓవర్ వేసిన మార్ష్ కేవలం నాలుగు బంతులు మాత్రమే వేయగలిగాడు. అరోన్ ఫించ్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో కుడికాలి చీలమండకు గాయమైంది. బాధను దిగమింగుతూనే మరో రెండు బంతులు వేసిన మార్ష్ ఆ తర్వాత వేయలేక మైదానాన్ని వీడాడు. దీంతో మిగిలిపోయిన రెండు బంతులు విజయ్ శంకర్ వేసి ఓవర్ పూర్తిచేశాడు. బ్యాటింగులో నంబరు పదిలో వచ్చిన మార్ష్ క్రీజులో నిలబడలేక డకౌట్ అయ్యాడు. మార్ష్ గాయం మరింతగా వేధించడంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు.