మాస్కుల తయారీలో మహిళలు

ప్రపంచంతోపాటు మన దేశాన్ని కూడా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు ప్రజలు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. అందుకే ఎలాంటి వైరస్ సోకకుండా మాస్కుల వాడకంకు విపరీతంగా డిమాండ్ వచ్చేసింది. అందుకే మార్కెట్లో మాస్కులకు కొరత ఏర్పడడం, అధిక ధరలకు మాస్కుల విక్రయం నిత్యకృత్యమయింది. దీంతో మాస్కుల కొరత వ్యాపారాన్ని గమనించిన రంగారెడ్డి జిల్లా స్వయం సహాయక మహిళలకు ఈ వ్యాపారం సరికొత్త ఆదాయ మార్గంగా మారింది. శంకరపల్లి మండల సమాఖ్య ఆధ్వర్యంలో మాస్కుల తయారీ యుద్ధప్రాతిపదికన నడుస్తోంది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో స్వయం సహాయక మహిళలకు మాస్కుల తయారీ మంచి ఆదాయ వనరుగాకే కాకుండా సామాజిక సేవగానూ మారిందని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

మార్కెట్లో ఒక్కొక్క మాస్క్ కనీసం నలభై రూపాయలనుండి వంద రూపాయలకు పైబడి ఉందని, అయితే స్వయం సహాయక మహిళలు తయారు చేసే మాస్క్ మాత్రం కేవలం 15 రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నామన్నారు. మాస్కుల తయారీకి ఉపయోగించే క్లాత్ కిలోకు 150 రూపాయలనుండి 200 వరకు మార్కెట్ లో లభ్యమవగా, నేడు అది కిలో క్లాత్ 400 రూపాయలకు పెరిగిందని, లాక్ డౌన్ వల్ల బయటి రాష్ట్రాలనుండి క్లాత్ రాకపోవడమే నని పీడీ తెలియచేసారు. ఎన్నిమాస్కులైనా తయారీకి సిద్ధంగా ఉన్నప్పటికీ క్లాత్ కొరత ఉందని అన్నారు. మొత్తానికి మాస్కుల తయారీ రంగా రెడ్డి జిల్లా స్వయం సహాయక మహిళలకు ఉపాధి తోపాటు ఆదాయ మార్గంగా మారింది.