మెగా చిరుతో మెగా పవర్ స్టార్ సినిమా…

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’లో కొణిదెల ముద్దుల బిడ్డ రామ్ చరణ్ నటించబోతున్నాడు.

ఈ విషయాన్ని మెగాస్టారే స్వయంగా ధ్రువీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజను ఈ సినిమాలో నటించేందుకు ‘RRR’ నుంచి నెల రోజుల పాటు అతడికి విరామం ఇవ్వాలని దర్శకుడు రాజమౌళిని మెగాస్టార్ కోరితే వెంటనే ఒప్పేసుకున్నారని తెలిసింది.

కరోనా ప్రభావం తర్వాత చరణ్ ‘RRR’ షూటింగ్ కోసం వెళ్లకుండా ‘ఆచార్య’ కోసం పని చేసే అవకాశముంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రలు.. గురు శిష్యుల్లా ఉంటాయని చిరు అంటున్నాడు.

చరణ్ చేయబోయే పాత్ర నిడివి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటుందని చిరు ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. తామిద్దరం కలిసి నటించాలని తన భార్య సురేఖ కోరుకున్నట్లు కూడా చిరు చెప్పాడు. ఈ ప్రత్యేక పాత్రకు మధ్యలో మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య అతడి పేరు వెనక్కి వెళ్లిపోయింది. మహేష్ మరీ ఎక్కువ పారితోషకం అడగడంతో బడ్జెట్ పెరిగిపోతుందని భావించి అతడి పేరును పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది.
ఒక దశలో ఈ పాత్రకు అల్లు అర్జున్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ అతడిని తీసుకునే విషయంలో ఏం జరిగిందో ఏమో. చిరు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినపుడు మాత్రం ముందు నుంచి చరణ్ పేరే చర్చల్లో ఉందన్నాడు. రాజమౌళి-కొరటాల మధ్య అవగాహన కుదిరితే చరణ్ ఈ సినిమాలో నటిస్తాడన్నాడు. ఇంతకుముందు చరణ్ నటించిన ‘మగధీర’- ‘బ్రూస్ లీ’ సినిమాల్లో చిరు కాసేపు కనిపించాడు.

చిరు చేసిన ‘ఖైదీ నంబర్ 150’లో చరణ్ ఓ పాటలో తళుక్కుమన్నాడు. ఐతే వీళ్లిద్దరూ కలిసి పూర్తి స్థాయిలో స్క్ర్రీన్ షేర్ చేసుకోబోతుండటం మాత్రం ఇదే తొలిసారి.