పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని వెల్లడించిన మెట్రో మ్యాన్

పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపడతానని వెల్లడించిన మెట్రో మ్యాన్

భారత్ లో ప్రజారవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేలా మెట్రో రైలు వ్యవస్థలకు ఊపిరిపోసిన ప్రముఖ ఇంజినీర్, మెట్రోమ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి పొందిన శ్రీధరన్ ప్రస్తుతం రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీర్ గా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను దేశానికి అందించిన ఆయన రాజకీయాల్లో చేరి సొంతరాష్ట్రం కేరళకు ఏదైనా చేయాలని పరితపిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న శ్రీధరన్ సీఎం పదవిపై అనురక్తి ప్రదర్శిస్తున్నారు.కేరళలో బీజేపీని అందలం ఎక్కించడమే పరమావధిగా శ్రమిస్తానని, ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు కూడా తాను సిద్ధమేనని తన మనోగతం వెల్లడించారు. ఒకవేళ తాను కేరళ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గవర్నర్ పదవిపై తనకు ఏమంత ఆశ లేదని, ఆ పదవితో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం ఏమంత ఉండదని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.అంతేకాదు, తాను బీజేపీలో ఎందుకు చేరాలనుకుంటున్నాడో కూడా శ్రీధరన్ వివరణ ఇచ్చారు. కేరళను ఎల్డీఎఫ్ (సీపీఎం), ఎల్డీఎఫ్ (కాంగ్రెస్) ఎన్నో ఏళ్లుగా పాలిస్తున్నాయని, కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. ఈ రెండు పార్టీలు కేరళను అభివృద్ధి చేయలేకపోయాయని, అందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు.