దేశంలో కోవిడ్-19 అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన వస్తువుల సరఫరా సజావుగా సాగేలా చూడడంతో పాటు వైద్యానికి అత్యవసరమైన ఆక్సిజన్ సరఫరాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సూచించింది. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు ఒక లేఖ రాశారు.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశంలో తగినంతగా వైద్య సేవల కోసం ఆక్సిజన్ నిల్వలను కలిగి ఉండాల్సిన కీలక అవసరం ఉందని హోంశాఖ పేర్కొంది. దీనికి తోడు కోవిడ్ మహమ్మారిపై పోరుకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన అత్యవసర ఔషధాల జాబితాలో ఆక్సిజన్ కూడా ఒకటి అన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించింది. దేశంలో లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరిస్తూ కేంద్ర హోం శాఖ ఏకీకృత నిబంధన చర్యలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రభుత్వాలు, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల మంత్రిత్వ శాఖలు తీసుకోవాల్సిన లాక్డౌన్ చర్యలను ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం అత్యవసరాల మేరకు వాటిని వివిధ సందర్భాలలో సవరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.
పలు మిహాయింపులు జారీ చేయబడ్డాయి:
కోవిడ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలు అమలవుతున్నప్పటికీ మెడికల్ ఆక్సిజన్ గ్యాస్/లిక్విడ్, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు, ద్రవ ఆక్సిజన్ నిల్వ చేయడానికి క్రయోజెనిక్ ట్యాంకులు, లిక్విడ్ క్రయోజెనిక్ సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకులు, యాంబియంట్ ఆవిరి కారకాలు, క్రయోజెనిక్ కవాటాలు, సిలిండర్ కవాటాలు & ఉపకరణాలు; పై వస్తువుల రవాణా; సరిహద్దు నుంచి సరిహద్దు కదలికలతో పాటుగా ఉత్పాదక విభాగాల కార్మికులు మరియు వారి రవాణా, కార్మికులు ఇండ్ల నుండి తమతమ కర్మాగారాలకు ప్రయాణించడానికి అనుమతించాలని, పాసులు ఇచ్చేలా నిబంధనలకు ఇప్పటికే మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని హోంశాఖ మరోసారి పునరుద్ఘాటించింది. ఇదే సమయంలో వైద్య ఆక్సిజన్ కర్మాగారాలు పూర్తి వ్యవస్థాపిత సామర్థ్యంతో పని చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. అయితే ఇదే సమయంలో లాక్డౌన్ వేళ అనుసరించాల్సిన సామాజిక దూరం, పరిశుభ్రత పద్ధతులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ తన లేఖలో నొక్కి చెప్పింది. అటువంటి నిబంధనల అమలు ఆయా సంస్థల అధినేతలదే బాధ్యత అని పేర్కొంది. ఈ నిబంధనలు కఠినమైన అమలు ఉండేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని కూడా కోరింది. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు క్షేత్ర సంస్థలకు కఠినమైన సమ్మతి తగిన అవగాహన కల్పించవచ్చని కూడా హోంశాఖ ఈ లేఖలో పేర్కొంది