వలస కూలీలు వరస ప్రయాణాలు ఆగడం లేదు

క‌రోనా మ‌హ‌మ్మారి పేద‌వాడిని త‌రుముతోంది. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎక్క‌డిక‌క్క‌డ స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న క‌రోనా భ‌యంతో త‌మ స్వ‌స్థ‌లాల‌కు చేరుకోవాల‌ని వ‌ల‌స కార్మికులు చూస్తున్నారు. రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లు న‌డుపుతున్నా ల‌క్ష‌లాది మంది వ‌ల‌స జీవులు రోడ్ల‌పై న‌డుస్తూనే ఉన్నారు.

ముంబై – నాసిక్ హైవేపై వివిధ రాష్ట్రాల‌కు చెందిన‌ వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు చేరుకునేందుకు న‌డుస్తున్నారు.అందులో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రాష్ట్రం జాన్‌పూర్‌కు చెందిన ప్రీతి కుమారి కూడా ఉన్నారు. ఆమెను స్వ‌స్థ‌లానికి ఎందుకు వెళుతున్నార‌ని అడ‌గ‌గా, ఇక్క‌డ ప‌నిలేదు.. నా బిడ్డ‌కు తిండికూడా పెట్ట‌లేక‌పోతున్నాను. స్వంత‌గ్రామానికి వెళితే ఎలాగైనా బ‌తుకుతామ‌ని వెళుతున్నాం.

మేము ఇంత‌కు ముందు ప‌నిచేసిన చోట స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌డానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకోమ‌న్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకుని నాలుగు రోజులుగా ఎవ‌రైనా మా స్వ‌స్థ‌లానికి చేర‌వేస్తార‌ని ఎదురుచూశాం. దాత‌లు వ‌చ్చి ఆహారం పెడుతున్నారు. కాని రెండు పూట‌లూ ఆక‌లితో ఉండాలి. పెద్ద‌వాళ్ల‌మంటే ఆక‌లికి ఆగుతాం కాని పిల్ల‌ల‌ను ఎలా ఊర‌డించాలి. అక్క‌డ ఉన్న అధికారుల‌ను అడిగితే స‌మాధానం లేదు. అందుకే భ‌గ‌వంతుడిపై బారం వేసి న‌డ‌క ప్రారంభించాం. నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. ప్ర‌యాణంలో నా బిడ్డ‌కు ఎవ‌రైనా దాత‌లు ఇచ్చిన బిస్కెట్ల‌తో ఆక‌లి తీరుస్తున్నాన‌ని క‌న్నీటితో వాపోయారు. ఇన్ని రోజులు ప‌ని చేయించుకున్న వారు కూడా మూడు నెల‌ల జీతం ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.