గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు: మంత్రి హారీష్

తెలంగాణ సిద్దిపేటలోని రంగానాయక సాగర్ రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాలువ వెంట క్షేత్రస్థాయిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు.

సిద్ధిపేట జిల్లా రంగనాయక సాగరుకు రేపో, మాపో కాళేశ్వరం జలాలు రానున్న నేపథ్యంలో సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలో ప్రధాన ఎడమ కాలువతో చిన్నకోడూర్, సిద్ధిపేట రూరల్, నారాయణరావు పేట మండలాల్లో గ్రామాల చెరువులు, కుంటలు కాల్వ ద్వారా నిండనున్న క్రమంలో ప్రధాన ఎడమ కాలువ వెంట ఉన్న గ్రామాలను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. పరిశీలిస్తున్నారు.

రంగనాయక సాగర్ ప్రధాన ఎడమ కాలువ వెంట గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలను కాల్వల ద్వారా నింపేందుకు అక్కడక్కడా ఎదురైన అవాంతరాలను అధిగమించేలా ఆయా ప్రాంతాల స్థితిగతులకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలన్నారు.

గ్రామ శివారు కాల్వలు, పిల్ల కాల్వల్లో ఉత్పన్నమైన సమస్యలు, నీళ్లు నిండే కుంటలు, చెరువులు నింపే తూములు, ఆయకట్టు ఇచ్చే తూములు, పిల్ల కాల్వల ప్రతి అంశాన్ని ఇరిగేషన్ అధికారులతో క్షుణ్ణంగా మంత్రి హరీష్ చర్చించారు.

కాల్వలతో చెరువులు, కుంటలు నింపేందుకు అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బందితో మంత్రి సమీక్ష జరిపారు.