ప్రభుత్వం మీ అందరికి అండగా ఉంటుంది: కేటీఆర్

క‌రోనా క‌ట్ట‌డిపై కేటీఆర్‌ పర్యవేక్షణ

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో బుధ‌వారం విస్తృతంగా పర్యటించారు. కరోనా
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత హైదరాబాద్ నగరంలో వున్న పరిస్థితులను స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు. ప్రగతి భవన్ నుండి బుద్ధ
భవన్‌ వరకు వెళ్తుండగా దారిలో రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తున్న కార్మికులను పలకరించగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కార్మికులుగా తెలిసింది. వాళ్లందరికీ ఉప్పల్ వరకు వెళ్ళడానికి తన సిబ్బందికి చెప్పి వాహనాన్ని ఏర్పాటు చేశారు.

అదేవిధంగా అక్కడే కనిపించిన బీహార్ కు చెందిన ఓ కార్మికుడు, తాను అనాథ అని, తనకు చూసుకోవడానికి ఎవరూ లేరని మంత్రికి చెప్పిన వెంటనే, GHMC నిర్వహిస్తోన్న బస చేసే ప్రదేశంలో అతనికి సౌకర్యం కల్పించారు.

అక్కడి నుంచి బుద్ధ భవన్‌లో ఉన్న విపత్తు నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ మహానగరంలో డిజాస్టర్ రెస్పాన్స్ టీములు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపైన డైరెక్టర్ ఎంఫోర్స్మెంట్ & డిజాస్టర్ మెనెజ్మెంట్ విశ్వజీత్ ను అడిగి తెలుసుకున్నారు. అక్కడే కంట్రోల్ రూములో వున్న సిబ్బందిని రోజు చేస్తోన్న పనులపై వాకబు చేశారు.

GHMC కేంద్ర కార్యాలయంలో వున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంతాన్ని కూడా మంత్రి సందర్శించారు. వివిధ సమస్యలపైన కంట్రోల్ రూంకు వస్తున్న ఫిర్యాదులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలపైన వచ్చే కాల్స్ ను మానవతా దృక్పథం తో స్పందించాలని సూచించారు.

గోల్నాకాలో వున్న GHMC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస చేసే ప్రదేశాన్ని మంత్రి పర్యవేక్షించారు. అక్కడ నివాసిస్తోన్న అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులు మరియు వికలాంగులకు ఆసరా పెన్షన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మొహంతిను ఆదేశించారు. అక్కడ పక్కనే ఉన్న కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరియు ఇంటిలో
నుండి ఎవరు బయటకు రావద్దని, ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అందరికి అండగా ఉంటుందని చెప్పారు. డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు నిరంతరం చేపడుతున్న క్రిమి సంహారక స్ప్రే కార్యక్రమాన్ని ఎర్రగడ్డలో పర్యవేక్షించారు.

జగిత్యాల జిల్లా పెద్దపల్లి మండలం తుమ్మలగుంట గ్రామానికి చెందిన తోట రఘు కి తన సొంత నిధులతో మూడు చక్రాల యాక్టివా వాహనాన్ని మంత్రి కే తారకరామారావు అందించారు