ఐక్యమత్యంతో కరోనాపై పోరాడుదాం: మంత్రి శ్రీనివాస్

అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందామని రాష్ట్ర మంత్రి డాక్టర్. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అనాధ శరణాలయంలో నిరాశ్రయులకు రెడ్క్రాస్ ద్వారా ఏర్పాటు చేసిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్బంగా నిరాశ్రయులు,ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారు, అనాధలు భోజనానికి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ లోని అనాధాలకు ప్రతిరోజు టిఫిన్,భోజనం ,రాత్రి భోజనం తో పాటు స్నానం చేసేందుకు సబ్బు అన్ని ఏర్పాటు చేశామని బయటకు వెళ్ళవద్దని కోరారు. ప్రతి రోజు స్నానం చేసి పరిశుభ్రతను పాటించాలని ఎవరికైనా అవసరం ఉంటే డాక్టర్ను కూడా అక్కడికి పిలిపించి వైద్య సేవలు అందిస్తామని అన్నారు. కరోనా వైరస్ సద్దు మనిగిన తర్వాత పని కల్పిస్తామని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ కోరారు.

 

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కారణంగా ఎక్కడ సమస్య వచ్చినా సహకారం అందిస్తామని తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో కరోనా వచ్చిన ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారిని కలిసిన వారికి కూడా చికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, కొత్తగా ఎవరైనా ఒక వ్యక్తి కలిసి నట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులుగాడవద్దని అన్నారు ఇంట్లో ఉండి కూడా కరోనా వైరస్ ను పారద్రోలేందుకు ఆలోచించాలని అని అన్నారు కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యాంగ్య ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ,ఇటీవల తనపై టిక్ టాక్ నిర్వహించిన ఒకరిని జైలుకు పంపటం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్ డౌన్ కాలంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు, నిరాశ్రయులు అన్నం కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను అందరికీ అన్నం పెడుతున్నము అని, ముఖ్యంగా ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి బియ్యం ఇస్తున్నామని, నగదు ఇస్తున్నామని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు . ఈ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రందేవ్ 25 వేల రూపాయల విరాళాన్ని మంత్రికి చెక్కు రూపంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్,రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జనార్ధన్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి ,కౌన్సిలర్ కృష్ణమోహన్, పిఎసిఎస్ అధ్యక్షులు వెంకటయ్య తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి 50 మంది అనాధలకు ప్లేట్లు, గ్లాసులు ,దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.