*వ్యవసాయ, అనుబంధ రంగంకు లాక్డౌన్ మినహాయింపులు
*వ్యవసాయ యంత్రాలు, మరమ్మతు దుకాణాలకూ వర్తింపు
*తోటలతో సహా దేశంలో తేయాకు పరిశ్రమలకూ సడలింపులు
*సాగు రైతులు, కార్మికులకు ఇబ్బందులు రాకుండా చర్యలు
*కరోనా లాక్ డౌన్ కారణంగా జారీ చేసి హోంశాఖ వర్గాలు
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ అమలవుతున్న కారణంగా వ్యవసాయ రంగంలోని రైతులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం పంటలు చేతికొచ్చి మళ్లీ నారుమడ్లు వేసే సమయం కావడంతో సాగు రంగంలోని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను తాజాగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు మరియు మరిన్ని సడలింపులను మంజూరు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విపత్తుల నిర్వహణ చట్టం నోటిఫికేషన్‌కు 4వ అనుబంధాన్ని జారీ చేసింది. దీని ప్రకారం ప్రకారం, వ్యవసాయ యంత్రాల దుకాణాలు, విడి భాగాలు, యంత్ర మరమ్మతు కేంద్రాలు, రహదారులపై ట్రక్కుల మరమ్మతు షాపులు, ఇంధనంతో పనిచేసే పంపుల దుకాణాలు తెరచి ఉండేందుకు అనుమతించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేయడానికి వీలుగా వీటిని తెరిచి ఉంచాలని సర్కారు నిర్ణయించింది. దీనికి తోడు టీ పరిశ్రమలు, తోటల్లో గరిష్టంగా 50% మంది కార్యకలాపాలను నిర్వహించేలా అనుమతిస్తూ సడలింపులు వ్వనున్నారు. అయితే ఇదే సందర్భంలో ఆయా సంస్థలు లేదా వాటి యాజమానులు సిబ్బంది మధ్య సామాజిక దూరంతో సహా అన్ని పరిశుభ్రత నిబంధనలు తప్పక అమలయ్యేలా చర్యలు చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఉత్తర్వులను కఠినంగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను హోం మంత్రత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.