గ్రేటర్ లో ప్రచారం చేయనున్న మోదీ, అమిత్ షా

గ్రేటర్ లో ప్రచారం చేయనున్న మోదీ, అమిత్ షా

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో కమలనాథులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. గ్రేటర్ లో తమ సత్తా నిరూపించుకోవాలని కసితో ఉన్న బీజేపీ ఈసారి ఏకంగా పార్టీ హైకమాండ్ పెద్దలనే ప్రచార రంగంలోకి తీసుకువస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా జీహెచ్ఎంసీలో ప్రచారం చేయనున్నారు. ఇవాళ జరిగే ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు స్పందిస్తూ, బీజేపీ అగ్రనేతల పర్యటన తాలూకు షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, అయితే వారు ప్రచారానికి వస్తున్న విషయం మాత్రం నిర్ధారణ అయిందని వెల్లడించారు. మోదీ, అమిత్ షాలే కాదు… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా బీజేపీ ప్రచారంలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది.బీజేపీకి చెందిన ఓ ముఖ్యనేత మాట్లాడుతూ, అగ్రశ్రేణి నేతలు ఇక్కడికి రావడం ద్వారా బీజేపీ ఇక్కడే ఉంటుందన్న బలమైన సందేశాన్ని ఓటర్లకు అందించాలన్నది తమ అభిమతమని చెప్పారు.