ఇండియాకు ఆహార సమస్య వస్తుందా? పూర్తి వివరాలు

భారతదేశంలో ఆహార తయారీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలతో నిరంతరం కేంద్ర ఆహార ప్రక్రియ మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.
ఆహార పరిశ్రమ ప్రతినిధుల ప్రధాన సంఘాలైన ఫిక్కీ, సీఐఐ, అసోచామ్, PHDసీసీఐ అలాగే ఇతర సంఘాలతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పునరుత్తేజంతో పనిచేసేలా ప్రభుత్వం తరఫున తీసుకోవలసిన చర్యలకు పరిశ్రమల నుంచి సూచనలను స్వీకరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు కేంద్రం, రాష్ట్ర స్థాయిలోను తీసుకున్న చర్యలను వివరించారు. సూక్ష్మ స్థాయి వరకు ఉన్న సమస్యల పరిష్కారానికి ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని చెప్పారు. వస్తు సరఫరా కొనసాగింపు వ్యవస్థల అనుసంధానం, ఆహరం, ఔషధాలు అందుబాటులో ఉండేలా వ్యూహం, ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని అధికారులు చెప్పారు.

లాక్ డౌన్ కారణంగా 348 సమస్యలు తెలెత్తితే అందులో 50% పరిష్కరించామని, ఇంకా వివిధ స్థాయిలో మిగిలిన సమస్యలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అనుకున్న చర్యలు క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసాక ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు, పరిస్థితులు సజావుగా సాగేలా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.

వలసపోయిన కార్మికులు తిరిగి రావడానికి వీలుగా ప్రత్యేక రైళ్లను నడపాలని పరిశ్రమ ప్రతినిధులు సూచించారు. అలాగే వెంటనే ఉత్పన్నమయ్యే ద్రవ్య సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తులను సమీకరించుకోడానికి తగు మూలా ధన మద్దతు ఇవ్వాలని ప్రతినిధులు కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమ కార్యకలాపాల విషయంలో ఆందోళన ఉందని, వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

పరిశ్రమ ప్రతినిధులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్, సమస్యల పరిష్కారానికి అన్ని మార్గాలను అనుసరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ మాట్లాడుతూ పరిశ్రమ ప్రతినిధులు లేవనెత్తిన ఈశాన్య రాష్ట్రాలలో సమస్యలను ఆయా రాష్ట్రాలతో కూడా చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామని అన్నారు.

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో ఎలాంటి ఆహారం కోరత రాకుండా, లేకుండా చూస్తున్నామని ఆహార తయారీ ప్రక్రియ పరిశ్రమల మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు.