కోవిడ్‌-19పై నవీకృత ‘స్వచ్ఛత యాప్‌’

కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ నిన్న నవీకరించిన ‘స్వచ్ఛత-మొహువా’ (Swachhata-MoHUA) యాప్‌ను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి శ్రీ దుర్గాశంకర్‌ మిశ్రా అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాల ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుత యాప్‌ను దేశంలో 1.7 కోట్ల మందికిపైగా వాడుతున్న నేపథ్యంలో పట్టణ పాలక సంస్థలు కోవిడ్‌-19పై ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించేలా దీన్ని పూర్తిగా నవీకరించి విడుదల చేశారు. అయితే, ఇందులోని ఇతర అంశాలన్నీ యథాతథంగా ఉంటాయని, కోవిడ్‌-19పై 9 కేటగిరీలను అదనంగా చేర్చామని మంత్రి శ్రీ దుర్గాశంకర్‌ మిశ్రా సమావేశంలో వెల్లడించారు. అవేమిటంటే:

కోవిడ్‌-19 కాలంలో ఫాగింగ్‌/పారిశుధ్యం కోసం అభ్యర్థన
కోవిడ్‌-19 కాలంలో క్వారంటైన్‌ నిబంధన ఉల్లంఘన
కోవిడ్‌-19 కాలంలో దిగ్బంధం నిబంధన ఉల్లంఘన
కోవిడ్‌-19 అనుమానిత కేసుల సమాచార ప్రదానం
కోవిడ్‌-19 కాలంలో ఆహార సరఫరా కోసం అభ్యర్థన
కోవిడ్‌-19 కాలంలో ఆశ్రయం కోసం అభ్యర్థన
కోవిడ్‌-19 కాలంలో మందుల సరఫరా కోసం అభ్యర్థన
కోవిడ్‌-19 రోగుల తరలింపునకు సహాయం కోసం అభ్యర్థన
కోవిడ్‌-19 క్వారంటైన్‌ ప్రాంతంనుంచి వ్యర్థాల తరలింపునకు అభ్యర్థన.

నవీకృత స్వచ్ఛత యాప్‌ను ప్రస్తుతం ఎంపికచేసిన రాష్ట్రాలు, నగరాలకు పరిమితం చేశామని, వినియోగంపై సమీక్ష తర్వాత దేశవ్యాప్తంగా వాడకాన్ని విస్తృతం చేస్తామని మంత్రి తెలిపారు.