మద్యం ఏరులై పారును.. నిజమేనండోయ్..

ఏరులై పారుతున్న‌ మ‌ద్యం అని ఎవ‌రు ఎప్పుడు అన్నారో తెలియ‌దు కానీ లాక్ డౌన్ తో అది నిజం కాబోతోంది.

అన‌ధికారికంగా మ‌ద్యం విక్ర‌యాలు జోరుగా సాగిన‌ప్పుడు దాని తీవ్ర‌త‌ను తెలియ‌జేయ‌డానికి మాట వ‌రుస‌కు మ‌ద్యం ఏరులై పారుతోంద‌ని అంటుంటాం. కానీ అదే ఇప్పుడు నిజమైంది. లాక్‌డౌన్ వ‌ల్ల మ‌ద్యం ఏరుల్లో క‌లువ‌నుందంటే ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌ల‌తో గ‌త నెల 21వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా మ‌ద్యం విక్ర‌యాలు నిలిచిపోయాయి. మ‌ద్యం దొర‌క్క ఆత్మ‌హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నాలు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. మ‌ద్యం, క‌ల్లుకు బానిసైన కొంద‌రు మ‌నోవ్య‌ధ‌కులోనై చిత్ర విచిత్రాలు చేశారు.అయిన‌ప్ప‌టికీ కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యం విక్ర‌యాల విష‌యంలో రాజీలేకుండా నిషేదాన్ని కొన‌సాగించాయి. తాజాగా మ‌రో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడిగించ‌డంతో మ‌ద్యం త‌యారీ సంస్థ‌ల ప‌రిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. మ‌ద్యం విక్ర‌యాలు జ‌ర‌గుకా, మ‌రోవైపు పాడ‌వుతున్న నిల్వ‌ల‌ను ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఒక్క‌బాటిల్‌, రెండు బాటిళ్ళు కాదు ఏకంగా ఎనిమిది లక్షల లీటర్ల ఫ్రెష్‌, క్రాఫ్ట్ బీరు నీటిపాలుకానున్న‌ట్టు తెలుస్తోంది.

బార్‌లు, క్లబ్‌లలో లభ్యమయ్యే ఫ్రెష్‌ క్రాఫ్ట్ బీరు‌ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉండటంతో నిల్వ కోసం తంటాలు పడుతున్నాయి త‌యారీ సంస్థ‌లు. నిల్వ‌ల కోసం కరెంటు, ఇతర ఖర్చులు మీద పడుతుండటంతో తయారీ కేంద్రాలకు నష్టాలు తప్పడం లేదు. లాక్‌డౌన్ పొడిగింపు వ‌ల్ల‌ దాదాపు 250 మైక్రో బ్రూవరీలు తమ నిల్వలను ఖాళీ చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.

దేశ రాజ‌ధాని ప్రాదేశిక ప్రాంత‌మైన గురుగ్రామ్‌లో బీర్ల‌ను నీటి పాలు చేసే ప్ర‌క్రియ మొద‌ల‌య్యింది. మ‌రోవైపు మైక్రో బ్రూవ‌రీస్ త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం అన్ని ప్లాంట్ల‌లో నిల్వ ఉన్న 8 ల‌క్ష‌ల లీట‌ర్ల ఫ్రెష్ బీర్ పాడ‌వ‌కముందే గ్రోలర్స్‌(పెద్ద సీసాలు) సాయంతో టేక్-అవే సదుపాయానికి అనుమతించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. బీరు స‌మ‌స్య ప‌క్క‌న‌పెడితే, మినహా ఉత్తర భారతదేశంలో
(ఢిల్లీ మిన‌హా) రూ.700 కోట్ల విలువైన విదేశీ మద్యం నిల్వలు ఉండిపోయాయి. గత ఆర్థిక సంవత్సరాంతానికి ఈ నిల్వలు ఖాళీ కావాల్సిందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కాహాలిక్‌ బీవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) తెలిపింది.

కొత్త ఆర్ధిక సంవ‌త్స‌రం ప్రారంభ‌మై రెండో నెల న‌డుస్తోంది. దీంతో పాత స్టాక్‌ విక్రయాలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం ఉంటుంది. కాగా, గ్రీన్‌జోన్ల‌లో మ‌ద్యం విక్ర‌యాల‌కు వెసులుబాటు క‌ల్పించ‌డం వ‌ల్ల మ‌ద్యం త‌యారీ సంస్థ‌ల‌కు ఏ మేర‌కు ఊర‌ట‌నిస్తుంద‌నేది విక్ర‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.