పెద్ద కల నిజమైందన్న తమన్

పెద్ద కల నిజమైందన్న తమన్  

ఇటీవలి కాలంలో పలు సినిమాలకు హిట్ మ్యూజిక్ ఇచ్చిన నేటి బిజీ సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు క్లౌడ్ నైన్ మీద విహరిస్తున్నాడు. తన జీవితంలో ఇప్పుడు తనకు పెద్ద బ్రేక్ వచ్చిందని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దానికి కారణం, మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమాకి తొలిసారిగా సంగీతాన్ని సమకూర్చే అవకాశం ఇతనికి దక్కడమే!మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ను చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. మోహన్ రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చే అవకాశాన్ని తాజాగా తమన్ అందుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. “ప్రతి సంగీత దర్శకుడికి ఇదొక పెద్ద కల. అది ఇప్పుడు నా విషయంలో నిజమవుతోంది. మెగాస్టార్ చిరంజీవిగారిపై నాకున్న అభిమానాన్ని చాటుకునే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన చిరంజీవిగారికి, నా సోదరుడు మోహన్ రాజాకి కృతజ్ఞతలు.. లూసిఫర్ కోసం మా ప్రయాణం మొదలుపెడుతున్నాం” అంటూ తమన్ ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఆచార్య’ చిత్రం తర్వాత చిరంజీవి ఈ ‘లూసిఫర్’ షూటింగులో జాయిన్ అవుతారు.