అన్నదాతలకు సలాం సలాం/ఊరట

రైతులకు ఊరట కల్పించే చర్యలపై కేంద్రం నడుం బిగించింది.
ఖరీఫ్‌ సంసిద్ధతపై దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా
ఏప్రిల్‌ 16న జాతీయ సదస్సు నిర్వహణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నిన్న దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఆ శాఖ సహాయమంత్రి శ్రీ పురుషోత్తం రూపాలతోపాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రధాన వ్యవసాయ కార్యకలాపాలు, పంటకోతలు, వ్యవసాయ మార్కెట్లు, టోకు మండీల నిర్వహణ, కనీస మద్దతు ధరతో ఉత్పత్తుల సేకరణ, రైతులకు విత్తనాలు-ఎరువులు, ఇతర సదుపాయాల అందుబాటు తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సవాలు విసిరిన సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలపై రాష్ట్రాలు చూపిన చొరవను కేంద్ర మంత్రి ప్రశంసించారు. దేశంలో ఖరీఫ్‌ సీజన్‌ సంసిద్ధతపై ఏప్రిల్‌16వ తేదీన జాతీయ సదస్సును దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా నిర్వహిస్తామని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకటించారు. కేంద్రం ఇచ్చిన మినహాయింపులపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలను కోరారు.

దిగ్బంధం నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చిన కార్యకలాపాలు కిందివిధంగా ఉన్నాయి:

1. కనీస మద్దతుధర కార్యకలాపాలుసహా వ్యవసాయోత్పత్తుల సేకరణలోగల సంస్థలు.
2. పొలాల్లో రైతులు, రైతు కూలీలు చేసుకునే వ్యవసాయ పనులు.
3. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు లేదా రాష్ట్ర అనుమతిగల ‘మండీలు’.
4. రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాల అనుమతితో రైతులు/సహకారసంఘాల నుంచి నేరుగా వ్యవసాయోత్పత్తులు కొనుగోలుచేసే ‘టోకు మండీలు’.
5. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీ, ప్యాకేజింగ్‌ సంస్థలు; చిల్లర దుకాణాలు.
6. వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇచ్చే కేంద్రాలు;
రాష్ట్రంలో, రాష్ట్రాలమధ్య పంటకోతలుసహా ఇతర కార్యకలాపాలకు వాడే యంత్రాల సంచారం.
7. శీతల-సాధారణ గిడ్డంగుల సేవలు; ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్‌ సామగ్రి తయారీ సంస్థలు.
8. నిత్యావసర వస్తు రవాణా
9.వ్యవసాయ యంత్రాలు, విడిభాగాల (టోకు సరఫరా సంస్థలుసహా) విక్రయ దుకాణాలు.
10. కార్మికుల గరిష్ఠ సంఖ్య 50 శాతం మించకుండా తేయాకు (తోటలుసహా) పరిశ్రమ.

రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలు:

1. విత్తనాలు వేయడం, పంటకోతలు, ఉత్పత్తుల విక్రయాలుసహా వ్యవసాయ కార్యకలాపాలపై క్షేత్రస్థాయి సంస్థలకు అవగాహన కల్పన.
2. మినహాయింపుగల కార్యకలాపాల సంబంధిత సంస్థల సిబ్బంది, యంత్రాలు, సామగ్రి ప్రయాణ-రవాణా తదితరాలకు సత్వర అనుమతుల మంజూరు.
3. నిత్యావసరాల పంపిణీకి జాతీయ సరఫరా శృంఖలాలుగల కంపెనీలు/సంస్థలకు అనుమతి పత్రాలు, వాటి సిబ్బందికి అంతర్గతంగానే ప్రాంతీయ పాసుల జారీ అధికారం మంజూరు.
4. ఈ మినహాయింపుల అమలులో భాగంగా సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత నిబంధనల తప్పనిసరి అమలు, అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్‌ నిర్మూలన చర్యలు చేపట్టడం.

ఈ సంక్షోభ సమయంలో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనడంలో పూర్తి సహాయ-సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి అన్ని రాష్ట్రాలకూ హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగ కార్యకలాపాల విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్రాల వ్యవసాయశాఖ మంత్రులు ఈ సందర్భంగా కొనియాడారు. సామాజిక దూరం, పరిశుభ్రత నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.