జాతీయ ప్రయోజనాలకు NEET తప్పనిసరి – సుప్రీంకోర్టు

NEET పరీక్ష జాతీయ ప్రయోజనాలకు అవసరం, ఏ మైనారిటీ సంస్థల హక్కులను ఉల్లంఘించరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష నిర్వహణపై ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆద్వర్యంలోని త్రి మూర్తుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

 

దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా సంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో జాతీయ అర్హత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

మైనారిటీ విద్యాసంస్థలు, డీమ్డ్‌ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది. దీని వల్ల విద్యార్థులను చేర్చుకోవడంలో ఆయా విద్యాసంస్థలకు ఉన్న ప్రత్యేక హక్కులకు ఎలాంటి భంగం కలగదని వ్యాఖ్యానించింది. ‘‘నీట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించడం వల్ల మైనారిటీ విద్యాసంస్థల హక్కుల్లో ఎలాంటి మత, భాషాపరమైన ఉల్లంఘలను చోటుచేసుకోవు. ప్రస్తుతం విద్య స్వచ్ఛంద సేవ అనే స్వభావాన్ని కోల్పోయి, ఒక వస్తువుగా మారిపోయింది. వ్యవస్థలో ఉన్న చెడును తొలగించి, అవినీతిని రూపుమాపడం కోసం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నీట్ ప్రవేశపెట్టబడింది. ఇప్పటికీ ప్రవేశాల ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది’’ అని జస్టిస్‌ అరుణ్ మిశ్రా, జస్టిస్‌ వినీత్ శరణ్, జస్టిస్‌ ఎమ్‌. ఆర్‌. షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేంద్ర కౌన్సిలింగ్ ప్యానెల్‌ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేందుకు ప్రైవేటు కళాశాలలు నిరాకరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. నీట్ మార్కుల ఆధారంగానే అన్ని మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను చేర్చుకోవాలని సూచించింది. నీట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తే తమ హక్కులకు భంగం కలుగుతుందని గతంలో కొన్ని మైనారిటీ, ప్రైవేటు కళాశాలలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతే కాకుండా తమ సంస్థలలో అడ్మిషన్‌ కోసం ప్రత్యేకంగా పరీక్షను నిర్వహించేందుకు అనుమతించాలని కోరాయి. ఈ రెండు ఆలోచనలు తప్పని కోర్టు అభిప్రాయపడింది. ‘‘నీట్‌ను కాదని మరో పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక అనుమతులు మంజూరు చేయలేం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా వ్యవస్థను బలహీనపరచే చెడును తొలగించాలి. అలా చేయలేకపోతే అర్హత, ఆకాంక్ష కలిగిన వ్యక్తులకు న్యాయం చేయలేం. ఇందుకు రాష్ట్రాలకు మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థల సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించే హక్కు ఉంది’’ అని తెలిపింది.