ఆరోగ్య సేతు యాప్ కొత్త మార్గదర్శకాలు

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దృష్ట్యా బుధవారం మరిన్ని మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

ఆఫీస్‌కు బయలుదేరే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సేతు యాప్‌ తమ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని.. యాప్‌లో ‘సేఫ్’ లేదా ‘లో రిస్క్‌’ అని చూపెడితేనే ఆఫీస్‌కు రావాలని, ఒకవేళ బ్లూటూత్‌ సామీప్యత ఆధారంగా యాప్‌లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్‌’ అని స్టేటస్‌ చూపెడితే ఆఫీస్‌కు రానవసరంలేదని తెలిపిన కేంద్రం.

14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం కానీ, యాప్‌లో స్టేటస్‌ లో రిస్క్‌ లేదా సేఫ్‌ అని చూపెట్టేవరకు ఇంటివద్దే ఉండాలని సూచనలు అందాయి. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆదేశాలు తప్పకుండా అమలయ్యే చూడాలని జాయింట్‌ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసారు.