విదేశేయులే లక్ష్యంగా ‘స్ట్రాండెడ్ ఇన్ ఇండియా’పోర్టల్

కొత్తగా ప్రారంభించిన “స్ట్రాండెడ్ ఇన్ ఇండియా” అనే పోర్టల్, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న విదేశీ పర్యాటకులకు సహాయం చేస్తోంది. పర్యాటకులకు, పర్యాటక పరిశ్రమకు ప్రభుత్వం జారీ చేస్తున్న అన్ని ఆరోగ్య సంబంధమైన సూచనలతో పాటు ఇతర సలహాలు, మార్గదర్శకాలను పర్యాటక మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా ఈ పోర్టల్ ద్వారా తెలియజేస్తోంది.

పర్యాటకులు, హోటళ్లు, ఇతర భాగస్వాములు తీసుకోవలసిన వివిధ చర్యల గురించి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీచేసిన సలహాలు, మార్గదర్శకాలను అమలు చేయడంలో పర్యాటక మంత్రిత్వ శాఖ చురుకుగా వ్యవహరిస్తోంది. పర్యాటకులతో పాటు పరిశ్రమ సంఘాల సిబ్బంది కోసం చేపట్టవలసిన భద్రతా చర్యలను కూడా హోటళ్ల యాజమాన్యాలు, ఇతరులకు విస్తృతంగా తెలియజేయడం జరుగుతోంది.

ఈ సలహాలు, మార్గదర్శకాలును వివిధ భారత పర్యాటక కార్యాలయాలకు కూడా పంపించి, వాటికి సంబంధించిన ప్రాంతాలలో సమన్వయం మరియు క్రియాశీల పర్యవేక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్-19 విస్తృతంగా వ్యాపించిన దేశాల నుండి వచ్చిన పర్యాటకుల జాబితాను ప్రాంతీయ కార్యాలయాలకు పంపించడం జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అనుమానం ఉన్న వ్యక్తులను విడిగా క్వారంటైన్ లో ఉంచడానికి వీలుగా – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం వారిపై నిఘా ఉంచి, వారి కదలికలను పర్యవేక్షించ వలసిందిగా
కోరింది. ఈ విషయాలన్నింటిలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖ మరియు రాష్ట్ర పరిపాలనా విభాగంతో చురుకుగా సహకరిస్తోంది. ఈ లోగా, పర్యాటకులు క్షేమంగా తిరిగి తమ దేశాలకు వెళ్ళడానికి అవసరమైన సహాయాన్ని అందించడంలో “స్ట్రాండెడ్ ఇన్ ఇండియా”
పోర్టల్ విజయవంతంగా పనిచేస్తోంది. వివిధ సంస్థల మధ్య సమన్వయంతో ఈ వేదిక ఎలా పనిచేస్తోందో కొన్ని ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. గుజరాత్ లో చిక్కుకుపోయిన అమెరికా దేశస్తులకు గుజరాత్ ప్రభుత్వం వాహనాల పాసులు జారీ చేసింది. వారు అంతర్గతంగా ప్రయాణించడానికీ, అదేవిధంగా స్వదేశం తిరిగి వెళ్లడానికీ గుజరాత్ పర్యాటక సంస్థ, పర్యాటక మంత్రిత్వశాఖ, పశ్చిమ ప్రాంత కార్యాలయం సంయుక్తంగా అమెరికా రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అదేవిధంగా బీహార్ లో చిక్కుకున్న అమెరికా కు చెందిన ఒక మహిళకు ఢిల్లీ వెళ్లడానికీ, అక్కడ నుండి అమెరికా వెళ్లడానికీ వీలుగా “ట్రావెల్ పర్మిట్” పొందడానికి సహకరించడం జరిగింది.
సిలిగురి మరియు కోల్కతా లలో చిక్కుకున్న ఆస్ట్రేలియా కు చెందిన మూడు బృందాలు, తాము స్వదేశానికి వెళ్ళడానికి సహకరించవలసిందిగా, “స్ట్రాండెడ్ ఇన్ ఇండియా” పోర్టల్ ద్వారా విజ్ఞప్తి చేశాయి. భారత పర్యాటక సంస్థకు చెందిన కోల్కతా కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి, ఢిల్లీ లో ఉన్న వారి హై కమీషనర్ తో సంప్రదించి, వారు క్షేమంగా తిరిగి స్వదేశానికి చేరుకునే విధంగా సహాకరించింది.