కరోనా ఇన్నోవేటివ్ ఛాలెంజ్

లాక్ డౌన్ సమయంలో ఇంట్లో సమయాన్ని సద్వినియోగం చేసుకొనే ఆలోచనలు, రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకర ఆహారం ఆవిష్కరణలకు శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆహ్వానం పలుకుతోంది

ఈ ప్రయత్నం సమాజంలో చైతన్యాన్ని తేవడమే కాకుండా వివిధ నైపుణ్యాలున్న విభిన్న వర్గాలను భాగస్వాములను చేసి పరిష్కారాలు పొందేలా చేయవచ్చని డిఎస్టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.

దేశమంతా కరోనా మహమ్మారి వల్ల పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. పౌరులు తమ సృజనాత్మకమైన ఆవిష్కరణలతో ముందుకు రావాలని పిలుపునిస్తూ ఛాలెంజ్ కోవిడ్-19 పోటీ (సి3) పేరుతో ఒక స్పర్థను నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆసక్తి ఉన్నవారంతా తమ సృజనాత్మక, ప్రేరణతో కూడిన ఆలోచనలను పంచుకోవాలని ఎన్ఐఎఫ్ పిలుపు ఇచ్చింది. వైరస్ ని తుదముట్టించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రజలు ఈ పోటీలో భాగస్వాములు కావాలని కోరింది. చేతులు, శరీరం ఇల్లు, బహిరంగ ప్రదేశాలు, ఇతర ప్రభావిత ప్రదేశాల శానిటైజింగ్, నిత్యావసర వస్తువుల పంపిణీ ముఖ్యంగా పెద్ద వారిని దృష్టిలో పెట్టుకుని, ఇంటింటికి వస్తువుల సరఫరా వంటి అంశాల్లో పౌరులు తమ సృజనాత్మక ఆలోచనలు అందివ్వాలని ఎన్ఐఎఫ్ పిలుపు ఇచ్చింది.

ఇళ్లల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా సమయాన్ని ఉపయోగకరంగా వెచ్చించవచ్చు, లాక్ డౌన్ లో ముడి ఆహార పదార్థాలు చాల పరిమితంగా ఉన్నపుడు పౌష్టిక విలువలు పెంచుకునేలా పాటించాల్సిన మంచి ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), వేగవంతమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల సౌకర్యాలు, కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడ్డాక దృష్టి సారించాల్సిన తక్కువ స్పర్శతో కూడిన పరికరాలు, వివిధ వర్గాలు ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మొదలైన వారికి కోవిడ్-19 సందర్బంగా ప్రయోజనకరంగా ఉండే ప్రయత్నాలు ఇలా వివిధ అంశాలపై పౌరులు తమ ఆలోచనలు పంచుకోవాలని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది.

“మూలాల్లోకి వెళ్లి సృజనాత్మక ఆలోచనలను ప్రజల నుండి వెలికితీసే ప్రయత్నాలపై దృష్టి పెడుతూ ప్రేరణ కలిగించే సంస్థ ఎన్ఐఎఫ్. ఇపుడు తీసుకున్న చొరవ చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా పలు సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా ప్రజల నుండే పొందే ఒక ప్రయత్నం” అని శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలిపారు.

దీనిద్వారా వచ్చే సాంకేతిక ఆలోచనలు, ఆవిష్కరణలు ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడతాయి. ప్రజలు సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలను campaign@nifindia.org and http://nif.org.in/challenge-covid-19-competition మెయిల్ కి పంపవచ్చు. దీనిలో పాల్గొన్న వ్యక్తి, వయసు, విద్యార్హతలు, వృత్తి, చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ వివరాలను పొందుపరచాలి. తాము సమర్పించే ఆలోచనలు, ఆవిష్కరణల ఫోటో లేదా వీడియోను కూడా జత చేయాలి. తదుపరి ప్రకటన వచ్చే వరకు సి3 పోటీకి ఎంట్రీలను స్వీకరిస్తారు.