కరోనా యుద్ధంలో 3D ఆయుధాలు

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ఉధృతమౌతున్న పరిస్థితుల్లో గౌహతిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) కోవిడ్ తో సాగుతున్న పోరాటంలో సహకారం అందించే రెండు ఉత్పత్తులతో ముందుకు వచ్చారు.

ఇందులో మొదటి ఉత్పత్తి త్రీడీ ప్రింటెండ్ హ్యాండ్స్ ఫ్రీ ఆబ్జెక్ట్. ఇది తలుపులు, కిటికీలు, అరలు, రిఫ్రిజిరేటర్ హ్యాండిల్ లేదా ఎలివేటర్ బటన్లు మరియు ల్యాప్ టాప్, డెస్క్ టాప్ కీబోర్డులను తెరవడానికి, మూయడానికి సహాయపడే పరికరం. వీటిలో బటన్లు స్విచ్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది. వివిధ ప్రదేశాల్లో కోవిడ్ వల్ల ఆయా వస్తువులు ప్రభావితం అయ్యాయేమో అనే భయం లేకుండా కలుషితమైన ఉపరితలం మీద దీన్ని వాడినప్పటికీ, కోవిడ్ వ్యాప్తి లేకుండా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందనే అంశం మీద పూర్తి విశ్లేషణ తర్వాత పరిశోధకులు ఈ వస్తువును తయారు చేశారు.

ఈ వస్తువును వాడడం సులభమే కాక, ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ళవచ్చని, అదే విధంగా వాడిన తర్వాత తాకే అవసరం లేకుండా శుభ్రం చేసుకోవచ్చని NIPER డైరక్టర్
డాక్టర్ USN మూర్తి తెలిపారు.

ఇక రెండవ ఉత్పత్తి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే త్రీడీ ప్రింటెడ్ యాంటీ మైక్రోబయల్ ఫేస్ షీర్డ్. నోరు, ముక్కు, కళ్ళు మొదలైన భాగాల ద్వారా వైరస్ వ్యాప్తి గురించి సమగ్ర అధ్యయనం తర్వాత దీన్ని రూపొందించారు. దీని రూపకల్పన కూడా సులభమే. తక్కువ ఖర్చుతో పాటు సులభంగా ధరించవచ్చు. మంచి రసాయన స్థిరత్వంతో పాటు గట్టిగా ఉంటుంది. శుభ్రం చేయడం కూడా చాలా సులభం.

జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఓ ప్రధాన సంస్థగా కరోనా పై పోరు సాగించేదుకు ఇలాంటి మరిన్ని వస్తువులు తయారు చేయనున్నట్లు శ్రీ మూర్తి తెలిపారు.