అదనపు బిల్లులు వసూలు చేయట్లేదు-ఏపీ ట్రాన్స్ కో

ఏపీలో కరెంటు బిల్లుల రచ్చ గట్టిగా నడుస్తోంది. రెండు నెలల బిల్లు ఒకేసారి లెక్కగట్టి వినియోగదారులపై అదనపు భారం మోపరంటూ ఆరోపణలు రావడంతో ఏపీ ట్రాన్స్ కో సిఎండి నాగులపల్లి శ్రీకాంత్ స్పందించారు. రెండు నెలలకు వేరువేరుగానే లెక్కగట్టినట్లు తేల్చిచెప్పారు. గడిచిన 5 ఏళ్లలో నమోదైన వివరాల ఆధారంగానే బిల్లు చేసినట్లు ప్రకటించారు. మార్చిలో 46 శాతం, ఏప్రిల్ లో 54 శాతం విద్యుత్ వినియోగం జరిగినట్లు చెప్పిన ట్రాన్స్ కో సిఎండి ఏప్రిల్ నెలలో అదనంగా ఉన్న 4 శాతాన్ని మార్చికి కలిపినట్లు స్పష్టతనిచ్చారు.

రెండు కూడా 50 శాతం, 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వటంతో స్లాబ్ మారే అవకాశం లేదని తేల్చిచెప్పారు. మార్చ్ నెలకు ఏప్రిల్ నెలకు బిల్లులు విడివిడిగా SMSలు పంపిస్తున్నట్లు చెప్పిన సిఎండి, మార్చి నెలకు సంబంధించి గత సంవత్సరం ట్యారీఫ్ , ఏప్రిల్ నెలకు సంబంధించి కొత్త ట్యారీఫ్ ప్రకారం బిల్లులను పంపించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ ఒక్క యూనిట్ అదనంగా బిల్లు వసూలు చేయట్లేదంటూనే…వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వారికి అనుకూలంగా బిల్లింగ్ చేస్తున్నామని ప్రకటించారు. సమస్యలు,అపోహలుంటే 1912 కాల్ చేయవచ్చని సూచించారు.