దేశంలోకి దిగుమతులు వద్దు మన ఉత్పత్తే ముద్దు

కోవిడ్ -19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగుమతుల ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాల్సి ఉందని, ఇందు కోసం ఒక నూతన విధానాన్ని పరిశీలిస్తున్నట్లు ఎం.ఎస్.ఎం. ఈ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సరికొత్త ఆవిష్కరణల ద్వారా నాణ్యతను మెరుగుపరచి, వ్యయాన్ని తగ్గించడం ద్వారా జ్ఞానాన్ని సంపదగా మార్చాలని ఆయన వివిధ రంగాలకు చెందిన వాటాదారులకు పిలుపునిచ్చారు. నాగపూర్ ఆధారిత ఎం.ఎస్.ఎం.ఈ. ఆరెండ్ క్లస్టర్ ఉదాహరణగా తీసుకున్న ఆయన, తొలి నాళ్ళ నుంచి వీరు తయారు చేస్తున్న పి.పి.ఈ. గురించి తెలిపారు. దేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 1200 రూపాయల విదేశీ ధరతో పోలిస్తే, వీరు తయారు చేసే పి.పి.ఈ.ల మార్కెట్ ధర రూ.550 నుంచి 650 మధ్య ఉందని, పెద్ద మొత్తంలో వీరు సరఫరా చేయగల పరిస్థితి ఉందని తెలిపారు. స్టార్టప్ ఎకో సిస్టమ్ మరియు ఎం.ఎస్.ఎం.ఈ.లపై కోవిడ్ -19 ప్రభావం మీద అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎ.ఎల్.ఈ.ఏ.పి) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గడ్కరీ ప్రసంగించారు. ఇందులో సాంకేతిక సేవా విభాగానికి చెందిన పలువురితో పాటు వినోద రంగానికి చెందిన కళాకారులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు సోను నిగం, నితిన్ మికేష్, తలాత్ అజీజ్ వీరిలో ఉన్నారు.

ఎగుమతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం ప్రస్తుత అవసరమని ఉద్ఘాటించిన శ్రీ గడ్కరీ, ప్రపంచ మార్కెట్ లో పోటీగా మారడానికి విద్యుత్ ఖర్చు, లాజిస్టిక్స్ ఖర్చు మరియు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి అవసరమైన పద్ధతులు అవలంబించాలని తెలిపారు. అంతే కాకుండా, విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తితో భర్తి చేయడానికి దిగుమతి ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జ్ఞానాన్ని సంపదగా మార్చడానికి పరిశ్రమలు ఆవిష్కరణ, వ్యవస్థాపకత, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధనా నైపుణ్యం మరియు గత అనుభవాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

వినోద పరిశ్రమను మరింత ఉన్నతంగా మార్చాల్సిన అవసరాన్ని శ్రీ గడ్కరీ నొక్కి చెప్పారు. ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ యొక్క వివిధ పథకాల ప్రయోజనాన్ని పొందడానికి ఎం.ఎస్.ఎం.ఈ.లుగా నమోదు కావాలని ఆయన సూచించారు.ప్రజల జీవనోపాధికి భరోసా ఇస్తూ, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాటాదారులంతా సమగ్ర విధానాన్ని అవలంబించాలని ఆయన తెలిపారు. ఈ సంక్షోభం నుంచి బయట పడడానికి పరిశ్రమ ఈ సమయంలో సానుకూల వైఖరిని కలిగి ఉండాలని శ్రీ గడ్కరీ కోరారు.

చైనా నుంచి జపాన్ పెట్టుబడులు తీసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళేందుకు జపాన్ ప్రభుత్వం తమ పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీని అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇది భారతదేశానికి మంచి అవకాశమని, దాన్ని ఒడిసి పట్టుకోవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశం సందర్భంగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వినోద పరిశ్రమతో పాటు వివిధ రంగాలకు చెందిన ఎం.ఎస్.ఎం.ఈ.లు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళ గురించి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాలను సమస్యల నుంచి గట్టున పడేసేందుకు ప్రభుత్వం నుంచి మద్ధతు కోరారు.

ఈ సమావేశంలో ప్రధానంగా తెలిపిన సమస్యలు మరియు అందించిన సూచనలు క్రింద తెలియజేయబడ్డాయి. ఎస్.ఎం.ఈ.లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి లైసెన్స్ ఫీజు ఉండకూడదు. గిరిజన ప్రాంతాలకు జీవనోపాధిని ప్రోత్సహించే పథకాల వ్యాప్తి. సరఫరా గొలుసు నిర్వహణలో ఫార్మా సెక్టార్ ఎస్.ఎం.ఈ.లకు మద్ధతు మరియు ఆర్బీఐ ఇచ్చిన మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని, వారి రుణాల పట్ల ఉదారంగా వ్యవహరించడం.

జిఎస్‌టిని వాయిదా వేయడం/తగ్గించడం మొదలైనవి.
ఈ సమావేశంలో ప్రతినిధుల ప్రశ్నలకు స్పందించిన శ్రీ గడ్కరీ, ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత మేర సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత విభాగాలతో చర్చించి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమ సానుకూల విధానాలను తీసుకోవాలని, అదే సమయంలో కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు.