ప్రపంచానికి కరోనా వైరస్ నేర్పిన గుణపాఠాలు అనేకం. కానీ
ఈ మహామ్మారి కారణంగా వాతావరణంలో కాలుష్యం శాతం మాత్రం బాగా పడిపోయింది. భూమండలంపై అన్ని దేశాల్లో లాక్డౌన్ కారణంతో అన్ని రంగాలు మూతతో పాటు వాహనాలు రోడ్డెక్కడం లేదు. చిన్న,మధ్యతరహా,భారీ పరిశ్రమలే మూతపడ్డాయి. వైరస్ దెబ్బకు దెయ్యం వదిలినట్టు పర్యావరణ పరిరక్షణ, శుభ్రతపై అవగాహన పెరిగింది దీంతో కాలుష్యం గణనీయంగా తగ్గుతోంది.
అందుకే మనదేశంలోని రాజధాని నగరం ఢిల్లీ ఉదహారణ. నిన్నమొన్నటి వరకు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడే ఢిల్లీ, NCR పరిసర ప్రాంతాలు కరోనాతో ఆ సమస్య నుంచి కోలుకున్నాయి. ప్రస్తుతం దేశంలోని 103 ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇటీవల చేసిన వాతావరణ పరీక్షల్లో 88 నగరాలు కాలుష్య కోరల నుంచి బయటపడి ప్రాణవాయువు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నాయి.
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ విభాగం నిర్వహించిన వాతావరణ పరీక్షల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0-50 పాయింట్ల మధ్యలో ఉంటే స్వచ్ఛం అని, 51-100 ఉంటే సంతృప్తికరమని, 101-200 మధ్య ఉంటే నామమాత్రమని అంతకు మించి నమోదైతే ప్రమాదకరంగా పరగణిస్తారు. ఈ అంచనా ప్రకారం 23 నగరాలలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తోంది. 63 నగరాలలో సంతృప్తికర స్థాయిలో ఉన్నది. మన సహజ వాతావరణంలో గాలిని విషపూరితం చేసే నైట్రోజన్ ఆక్సైడ్ శాతం పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఆర్థిక గమనాన్ని దెబ్బతీసే లాక్ డౌన్ల ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించగలగడం అనేది మంచి పరిణామమే.