NRIs వస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు??

లాక్ డౌన్ కారణంగా విదేశాలలో నిలిచిపోయిన భారత పౌరులు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ నగరంకు వస్తున్నందున ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై TS ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విదేశాలలో నిలిచి పోయిన భారతీయ పౌరుల తరలింపుకు సంబంధించి ఉత్తర్వులు Standard Operating Protocol జారీ చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఆరు దేశాల నుండి 7 ప్రత్యేక విమానాల ద్వారా దాదాపు 2350 మంది ప్రయాణీకులు రానున్నారని, ప్రయాణీకులకు అవసరమైన క్వారంటైన్, ఎయిర్ పోర్టులో మెడికల్ స్క్రీనింగ్ , కేంద్ర నోడల్ అధికారులతో సమన్వయం తదితర ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ TS CS అధికారులను ఆదేశించారు.

కేంద్ర నిబందనల ప్రకారం విదేశాల నుండి వచ్చే ప్రయణీకులు క్వారంటైన్ ఉండేందుకు తమ స్వంత ఖర్చుతో వెళ్లవలసి ఉంటుందని తెలిపారు. ప్రయాణీకుల 14 రోజుల వసతికి సంబంధించి హోటళ్లతో సమన్వయం చేసుకొని ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.

క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ చెకప్ లను నిర్వహించడానికి ప్రత్యేక మెడికల్ టీములను ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ నుండి క్యారంటైన్ సెంటర్లకు ప్రయాణీకులను తరలించే బాధ్యతను RTC MDకి అప్పగించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, వికాస్ రాజ్ , పోలీస్ శాఖ అదనపు డి.జి. (L&O) జితేందర్, కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్ , సైబారాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్, ప్రోటో కాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.