విదేశాల్లోని భారతీయులను తరలించే ప్రాధాన్యత క్రమం అధికారిక వివరాలు

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది.మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇందు కోసం మే 7వ తేదీ నుండి నుండి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమీషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు.

మొదటి దశలో వాయు మార్గాన 13 దేశాలనుండి 14,800 మందిభారతీయులను 64 విమానాల్లో భారత్ కు తీసుకురానున్నాం. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్, యుకె, యు ఏ ఈ, సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాలకు భారత విమానాలు చేరుకొని అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకువస్తాయి

సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుండి 300 మందిని తీసుకువస్తాం. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని ఈ క్రింది ప్రాధాన్య క్రమంలో భారతదేశంకు తరలిస్తాం.

1. ఆయా దేశాల నుండి వెలి వేయబడినవారు
2. వీసా గడువు ముగిసినవారు
3. వలస కార్మికులు
4. ఆరోగ్యరీత్యా భారత్ లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైనవారు
5. గర్భిణీ స్త్రీలు
6. భారత్ లో చనిపోయిన వారి బంధువులు
7. ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు
8. విదేశాల్లో హాస్టల్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులు

భారత్ కు రాదల్చుకున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించబడి సర్టిఫికెట్ పొంది ఉండాలి. వారు భారత్ కు చేరుకున్న తర్వాత కూడా పరీక్షలు నిర్వహించబడుతాయి. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటెన్ కేంద్రాలను నిర్వహిస్తాయి.

అదే విధంగా రక్షణశాఖ ఆధ్వర్యంలోని నౌకల ద్వారా కొన్నిదేశాల నుండి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం మన భారత ప్రభుత్వం అధ్వర్యంలో కొనసాగనున్నది.