చమురు ధరలు పాతాళంలో..

ప్రపంచ మార్కెటులో ముడిచ‌మురు ధరలు పాతాళానికి పడిపోయాయి. 1999 జనవరిలో క‌నిష్ఠ‌స్థాయి ధ‌ర‌ 11.72 డాలర్లుగా ఉండేది. అలాగే 2008 జూన్ నెలలో‌ క్రూడ్ ఆయిల్‌ 147.67 డాలర్లతో ఆల్‌టైమ్ రికార్డు చేసింది. కానీ కరోనా కాలంలో 2020 ఏప్రిల్ 20 నాటికి క్రూడ్‌ ఆయిల్ కనిష్ట స్థాయి మైనస్‌ 28 డాలర్లుకు ప‌డి పోయింది. చ‌రిత్ర‌లో క‌నివినీ ఎరుగ‌ని రీతిలో ముడిచ‌మురు ప‌త‌నావ‌స్థ‌కు చేర‌డానికి కార‌ణం మహామ్మారి క‌రోనా వైర‌స్‌.

విశ్వమంతా లాక్‌డౌన్‌తో భూ మండలానికి తాళం ప‌డింది. దీంతో ర‌వాణా వ్య‌వ‌స్థ స్థంభించి పోయింది. స‌రుకు ర‌వాణా మిన‌హాయిస్తే రోడ్డు, జ‌ల‌, వాయు ర‌వాణా ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయింది. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రపంచంలో చ‌మురు వినియోగం పూర్తిస్థాయిలో ప‌డిపోయింది. దీంతో చమురుకు డిమాండ్‌ భారీగా తగ్గిపోయింది. చ‌మురు ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.

వాస్త‌వానికి 2020 ఆరంభ‌ మాసాల్లో అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్ ధర తీవ్ర హెచ్చు తగ్గులను చవిచూసింది. ఈ ఏడాది జనవరిలో అమెరికా దాడుల్లో ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ మరణించడంతో భౌగోళిక ఉద్రిక్త పరిణామాల ప్ర‌భావానికి క్రూడ్‌ ఆయిల్ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత కరోనా ప్రభావంతో రష్యా–సౌదీ అరేబియాల (OPEC దేశాలు) మధ్య చోటుచేసుకున్న ఈ ‘ధరల యుద్ధం’తో క్రూడ్‌ ధర పతనమవుతూ వచ్చింది.

ఇదిలా ఉండ‌గా, క్రూడ్‌ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య OPEC పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం జూలై వరకు ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్‌ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అయితే డిమాండ్‌ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది.

ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఓ కారణమైతే, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఉత్తర అమెరికన్‌ సంస్థలు 5మిలియన్‌ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్‌ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా. ఎలియట్‌వేవ్‌ సిద్ధాంతం ప్రకారం వచ్చే దశాబ్దంలో ఎప్పడోకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చు అనేది అంచ‌నా. మళ్లీ ఆల్‌టైమ్‌ గరిష్టం 147.67 డాలర్లు చూడాలంటే ఎన్నేళ్లు ప‌డుతుందో వేచిచూడాల్సిందే.

కొస‌మెరుపు ఏమిటంటే ముడిచ‌మురు ధ‌ర మైన‌స్ డాల‌ర్ల‌కు ప‌డిపోయినా మ‌న‌దేశంలో మాత్రం పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మాత్రం ఇంకా చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న రేట్ల ప్ర‌కారమే మ‌న ద‌గ్గ‌ర పెట్రోలు, డీజిలు అమ్మ‌కాలు జ‌రుగుతుండటం శోచనీయం.