భిన్నత్వంలో ఏకత్వం రంజాన్ ముబారక్

మిత్రులారా దేశంలో, పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. చివరిసారి 2019లో రంజాన్ జరుపుకున్నాము, ఈసారి రంజాన్ పవిత్ర మాసంలో కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటామని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఈ ఇబ్బంది ప్రపంచం మొత్తం ఏర్పడింది. ఈ రంజాన్ మాసం సంయమనం, సద్భావన, సున్నితత్వం మరియు సేవలకు చిహ్నంగా మార్చడానికి మనకు అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనస్సులో మాటలో మాట్లాడారు.

ఈసారి ఈద్ రాకముందే ప్రపంచం కరోనా నుండి విముక్తి పొందాలని, మునుపటిలా ఉత్సాహంతో ఈద్ జరుపుకోవాలని గతంలో కంటే ఎక్కువగా ప్రార్థిస్తున్నాము. రంజాన్ ఈ రోజుల్లో, స్థానిక పరిపాలన మార్గదర్శకాలను అనుసరించి, కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలోపేతం చేస్తామని నాకు నమ్మకం ఉంది. రహదారుల్లో, వీధుల్లో, మార్కెట్లలో భౌతిక దూరం నియమాలను పాటించడం ఇప్పటికీ చాలా ముఖ్యం. రెండు గజాల భౌతిక దూరం విషయంలో, ఇళ్ల నుండి బయటకి రాగూడదనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మత పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వాస్తవానికి ఈసారి కరోనా మహామ్మారి భారతదేశంలో పండుగలను జరుపుకునే విధానాన్ని మార్చింది. ఇటీవల బిహు, బైసాకి, పుతండు, విషూ, శ్రీ రామ నవమి, ఉగాది, ఒడియా నూతన సంవత్సరం మొదలైన పర్వదినాలు వచ్చాయి. ప్రజలు ఈ పండుగలను ఇంటి లోపల ఉండి, చాలా సరళ విధానాలతో, సమాజం పట్ల శ్రేయో దృక్పథంతో ఎలా జరుపుకున్నారో చూశాము. సాధారణంగా ఈ పండుగలను స్నేహితులు కుటుంబాలతో పూర్తి ఉత్సాహంతో జరుపుకునేవారు. ఇంటి నుండి బయటకు వెళ్లి తమ ఆనందాన్ని పంచుకునేవారు. కానీ ఈసారి అందరూ సంయమనంతో ఉన్నారు. లాక్ డౌన్ నియమాలను అనుసరించారు.

ఈసారి మన క్రైస్తవ మిత్రులు కూడా ఇంట్లో ‘ఈస్టర్’ జరుపుకున్నది కూడా చూశాము. మన సమాజం, మన దేశం పట్ల ఈ బాధ్యతను నెరవేర్చడం ఈ రోజు చాలా ముఖ్యం. అప్పుడే మనం కరోనా వ్యాప్తిని ఆపగలుగుతాము. కరోనా వంటి ప్రపంచ మహమ్మారిని మనం ఓడించగలుగుతామని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.