లైఫ్ లైన్ ఉడాన్ మందుల సరఫరా

దేశవ్యాప్తంగా 24గంటల్లో 39.3 టన్నుల మందుల సరఫరాలను లైఫ్ లైన్ విమానాల ద్వారా రవాణా చేశారు. కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఈ విమానాలు దాదాపు 240 టన్నుల మందులను రవాణా చేశాయి. ఇప్పటి వరకు లైఫ్ లైన్ ఉడాన్ కింద 161 విమానాలు దాదాపు 1,41,080 కిలోమీటర్లు తిరిగాయి. వాటిలో 99 విమానాలను ఎయిర్ ఇండియా మరియు ఎలియన్స్ ఎయిర్ నడుపగా 54 విమానాలను భారతీయ వైమానిక దళం (ఐ ఏ ఎఫ్) నడిపింది. అంతేకాక ఏప్రిల్ 7, 2020న ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గంలో 6.14 టన్నుల వైద్యసామగ్రిని హాంగ్ కాంగ్ , ఆ పై నుంచి, అంతేకాక కొలంబో నుంచి 8.85 టన్నుల మందుల సరఫరాలను ఎయిర్ ఇండియా తీసుకొని వచ్చింది.

లైఫ్ లైన్ ఉడాన్ విమానాల తాజా సమాచారం, చిత్రాలతో లైఫ్ లైన్ ఉడాన్ వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతోంది. విమానాల ద్వారా మందులు, వైద్య చికిత్సా సామగ్రి రవాణాకు సంబంధించిన సమాచారం అందించడానికి ఈ వెబ్ సైట్ ప్రత్యేకించారు. దీనికి సంబంధించిన లింక్ https://esahaj.gov.in/lifeline_udan. విమానాలు, వాటిలో పంపుతున్న సరుకుల వివరాలను వివిధసంస్థలు, ప్రభుత్వ అధికారులు, విభాగాలు ఎల్లప్పుడు వెబ్ సైటులో ఉంచుతుంటాయి. దానివల్ల సంబందితులందరూ వివరాలను పోగుచేసుకుని సమన్వయంతో సమర్ధవంతంగా తమ కార్యాచరణను రూపొందించుకోవచ్చు. వినియోగాదారులకు ఎదురవుతున్న సవాళ్ళ ఆధారంగా, అవసరాలకు తగినట్లుగా పోర్టల్ ను తాజాపరచడం, సవరించడం జరుగుతోంది.

ఎయిర్ ఇండియా మరియు ఐ ఏ ఎఫ్ ప్రాధమికంగా జమ్మూ & కాశ్మీర్, లద్దాక్, ఈశాన్యం మరియు ఇతర ద్వీప ప్రాంతాలకోసం సహకరించు కున్నాయి. దేశీయ సరుకుల రవాణా విమాన సంస్థలు బ్లూ డార్ట్, స్పైస్ జెట్ మరియు ఇండిగో తమ సరుకుల విమానాలను వాణిజ్యసరళిలో నడుపుతున్నాయి. మార్చి 24 నుంచి ఏప్రిల్ 7వ తేదీ మధ్యలో స్పైస్ జెట్ 203 సరుకుల రవాణా విమానాలను నడిపింది. 2,77,080 కిలోమీటర్లు తిరిగి 1647.59 టన్నుల సరుకులను చేరవేసింది. వాటిలో 55 అంతర్జాతీయ సరుకుల రవాణా విమానాలు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 7వ తేదీ మధ్య బ్లూ డార్ట్ సంస్థకు చెందిన 64 దేశీయ రవాణా విమానాలు 62,245 కిలోమీటర్లు ప్రయాణించి 951.73 టన్నుల సరుకులను చేరవేశాయి. ఏప్రిల్ 3-4 తేదీల్లో ఇండిగో సంస్థ 8 సరుకుల రవాణా విమానాలను 6103 కిలోమీటర్లు నడిపి 3.14 టన్నుల సరుకులను చేరవేశాయి.