హైదరాబాద్‌లో ₹ 81 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత..

హైదరాబాద్‌లో ₹ 81 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత..

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరోసారి భారీఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. హైదరాబాద్‌ నగర శివారులో సుమారు రూ.81 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్‌ నుంచి ముంబయికి తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రూ.28.52 కోట్ల విలువైన 142.6 కిలోల మెఫెడ్రన్‌, రూ.3.1 కోట్ల విలువైన 31 కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫ్యాక్టరీలో మెఫెడ్రిన్‌ తయారీకి సిద్ధంగా ఉంచిన 250 కిలోల ముడిసరకునూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ ముడిసరకు విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. గత మూడు రోజులుగా హైదరాబాద్‌, ముంబయిలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు.. రూ. 45లక్షల భారత కరెన్సీ, యూఎస్‌ డాలర్లు, ఈయూఆర్‌ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.