మద్దతు రాలేదని ఏ ఒక్క రైతైనా నిరూపించగలరా?

తెలంగాణలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఒక దళారీలా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యాలు కళ్లుండి చూడలేని కబోదిలా ఉన్నాయని, రైతులకు ఎందుకు మద్దతు ధర ఇవ్వడం లేదని ప్రశ్నించడం శోచనీయమన్నారు.

శనివారం నాడు తన కార్యాలయంలో చైర్మన్ గారు విలేకరులతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలే కాకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు ఇవ్వకపోవడం, భారత ఆహార్ సంస్థ (ఎఫెసీఐ) నుంచి బిల్లులు సరైన సమయంలో రాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఒక్క రబీ సీజన్లోనే ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 1000 కోట్ల వడ్డీ భారం పడుతోంది. అయినా కూడా రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కరోనా లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా పౌరసరఫరాల సంస్థకు రూ. 25 వేల కోట్లను సమకూర్చారు.
ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నాం.

ఈ రబీలో ఇప్పటివరకు 1 లక్ష 93 వేల మంది రైతుల నుంచి 5139 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ. 2,394 కోట్ల విలువ చేసే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
ఇందులో ఏ ఒక్క రైతును అడిగినా చెపుతారు, కనీస మద్దతు వచ్చిందో రాలేదో.. ఒక్క రైతుకైనా కనీస మద్దతు ధర లభించలేదని నిరూపించగలరా??

కేంద్ర ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రమాణాలు పాటించకపోతే భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యాన్ని తీసుకోదు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా బిజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే కొలకత్తా నుంచి గన్నీ సంచులు తెప్పించాలి. రాజకీయ విమర్శలు మాని నిర్మాణాత్మక సూచనలు ఇస్తే ఖచ్చితంగా పాటిస్తాం.

కొన్ని చోట్ల ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తేమ, తాలు సమస్య ఏర్పడింది. దీనికి ప్రధానమైన కారణం 1152, 1156 వంటి కొత్త వంగడాల వల్ల ఈ తాలు, గింజ, ముడత వంటి నాణ్యత సమస్యలు వచ్చాయి. దీనిపై మేం వెంటనే స్పందించడం జరిగింది. మా కమిషనర్ శ్రీ పి. సత్యనారాయణ రెడ్డి గారు కూడా అదే రోజు 22వ తేదీనే అన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. నిన్నటి రోజున మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారితో కలిసి తంగళ్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది. ఆ తరువాత స్వయంగా నేను గంభీర్ రావ్ పేట, జిల్లాలె, ఎల్లారెడ్డిపేట, వీర్ణపల్లి, చందుర్తి మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాను.

తాలు సమస్య తప్ప ఎక్కడా ఎలాంటి సమస్యలు లేవు. తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టానుసారం కోత విధించవద్దని రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడం జరిగింది. దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మిల్లులను సీజ్ చేయడానికైనా వెనుకాడం. మా ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే అత్యంత ప్రాముఖ్యమైనవి. దీనికి మించింది మరొకటి లేదని చైర్మన్ మారెడ్డి మనివాస్ రెడ్డి అన్నారు.