పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు ఉప రాష్ట్రపతి వెంకయ్య

స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యనిర్వాహకులందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. గ్రామస్వరాజ్యాన్ని సాధించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్తిత్వాన్ని పొందిన స్థానిక స్వపరిపాలన సంస్థలు.. ఆ లక్ష్యాలను చేరుకునేందుకు మరింతగా కృషిచేయాల్సిన అవసరముంది.
అవకాశం ఇస్తే మహిళలు కావాల్సింది చేసి చూపిస్తారు. అందుకే స్థానిక స్వపరిపాలన పగ్గాలను వారికి అప్పగిస్తేనే మహిళా సాధికారత లక్ష్యాలు నెరవేరతాయి.

సర్పంచ్ కేంద్రిత వ్యవస్థ కాకుండా.. గ్రామసభ కేంద్రిత వ్యవస్థ, గ్రామస్తులందరి భాగస్వామ్యంతో ముందుకెళ్లినపుడు పారదర్శక, సమర్థవంతమైన స్వపరిపాలన సాధ్యమవుతుంది. దీన్ని అర్థం చేసుకుని, అమలు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

గ్రామరాజ్యం తోనే రామరాజ్య స్థాపన సాధ్యమన్న మహాత్ముడి ఆలోచనలను అర్ధం చేసుకుని ముందుకెళ్లాలి. కరోనాపై జరుగుతున్న పోరాటంలో క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ప్రతినిధులు పోషించే పాత్ర అత్యంత కీలకం. ఈ దిశగా కృషి జరగాలి. ఒడిశాలో సర్పంచు1లు సాధిస్తున్న ఫలితాలే ఇందుకు మంచి ఉదాహరణ.