జనసేన తెలంగాణ విభాగం కమిటీలతో పవన్ భేటీ

జనసేన తెలంగాణ విభాగం కమిటీలతో పవన్ భేటీ

జనసేన తెలంగాణ విభాగం ఇటీవల యువజ, విద్యార్థి కమిటీలు నియమించింది. తాజాగా ఈ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న ప్రజల కోసం బలంగా నిలబడి గొంతుక వినిపించాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంలో జనసేన పార్టీ తరఫున అందరం క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో కావొచ్చు, కరీంనగర్ జిల్లాల్లోని ఓ గ్రామంలో కావొచ్చు, లేక పాలమూరు రైతులు, కూలీల ఇబ్బందులు కావొచ్చు… ఎక్కడ, ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా స్పందిద్దామని ఉద్బోధించారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు కమిటీలతో సమావేశమై చర్చిద్దామని తెలిపారు. ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయడమనేది తెలంగాణ ప్రజల్లోనే ఉందని అన్నారు. యువకులు, విద్యార్థులు రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్లి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.