ఫోన్లు మాయమవుతోన్నాయి “రోబో 2.0”

ఢిల్లీలో ఉన్న మ‌ధుకు ఫోన్ చేశాడు బెంగుళూరుకు చెందిన మిత్రుడు అజ‌య్‌.. ఎన్నిసార్లు చేసినా ఫ‌లితం లేదు. క‌నీసం కాల్‌బ్యాక్‌ కూడా చేయ‌డం లేద‌ని బాధ‌లో ఉన్నాడు అజ‌య్‌. ఇంత‌లో మ‌రోసారి ప్ర‌య‌త్నం చేద్దామ‌ని మ‌ధుకు ఫోన్ చేశాడు అజ‌య్‌. రెండో రింగ్‌లోనే ఫోన్ ఎత్తిన మ‌ధు … హ‌లో ఎవ‌రు? అని అడిగాడు. నా నంబ‌రు తొలిగించావా అంటూ వాపోయాడు అజ‌య్‌. ఓహ్ అజ‌య్‌.. నా ఫోనులో డిస్ప్లే స‌రిగా క‌న‌ప‌డ‌డం లేదు. నెంబ‌ర్లు, పేర్లుకాడా రావ‌డం లేదు.. అంటూ బ‌దులిచ్చాడు మ‌ధు.. ఇది ఒక్క మ‌ధు స‌మ‌స్యే కాదు. దేశంలో ఫోను వినియోగిస్తున్న‌వారిలో చాలా మంది ఇలాంటి స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. క‌రోనా మొబైల్ ఫోన్ల‌కు కూడా వైర‌స్ ప‌ట్టుకున్న చందంగా మారింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో రిపేర్‌కు వ‌చ్చిన ఫోన్ల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వినియోగ‌దారులు.

దేశంలో సుమారు 90 కోట్ల మంది ఏదో ఒక కంపెనీ ఫోనును వినియోగిస్తున్నారు. టిక్‌టాక్‌, వాట్స‌ప్, ఇన్ట్సాగ్రామ్, ఫేస్‌బుక్ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. నెల‌కు 2 నుంచి 3 కోట్ల వ‌ర‌కు కొత్త మొబైల్ ఫోన్ల విక్ర‌యాలు జ‌రుగుతుంటాయి. ఆఫ్‌లైన్‌క‌న్నా ఆన్ లైన్‌లో ఈ కామ‌ర్స్ మార్కెటింగ్ ద్వారా అన్ని ప్ర‌ముఖ బ్రాండ్‌ల ఫోనులు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం అవుతున్నాయి. అయితే క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో అమ‌లులో ఉన్న లాక్‌డౌన్‌తో ఫోన్ విక్ర‌యాల‌తో పాటు మొబైల్ ఫోన్ల విడిప‌రిక‌రాలు విక్ర‌యాలు కూడా నిలిపివేయ‌డం జ‌రిగింది.

దేశంలో సుమారు మూడు కోట్ల ఫోన్ల వ‌ర‌కు మ‌ర‌మ్మ‌తుల స‌మ‌స్య‌ల‌ను వినియోగ‌దారులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ల విక్ర‌యాలు, మ‌ర‌మ్మ‌తుల విష‌యంలో అంత‌ర్జాతీయంగా ప్ర‌సిద్ధిగాంచిన దేశ రాజ‌ధాని ఢిల్లీలోని క‌రోల్‌బాగ్ గ‌ఫార్‌మార్కెట్‌లో నిర్మాణుష్యం అలుముకుంది. ఇక్క‌డ రోజులు వేల సంఖ్య‌లో ఫోన్ల మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతుంటాయి. లాక్‌డౌన్‌తో రిపేర్‌కు వ‌చ్చేవారు లేర‌ని ఫోన్‌మెకానిక్ మూల్‌చంద్ గోడు వెల్ల‌బుచ్చుకున్నాడు. కాగా, లాక్‌డౌన్ ఇలానే కొన‌సాగితే, మొబైల్ ఫోన్లు, యాసెస‌రీస్‌, మొబైల్ కుసంబంధించిన అన్ని ర‌కాల విడి విభాగాల‌పై ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటే దేశంలో మొబైల్ ఫోను వినియోగిస్తున్న వారిలో సుమారు 4 కోట్ల మంది మొబైల్ ఫోనుకు దూరం అయ్యే అవ‌కాశాలు లేక‌పోవ‌చ్చ‌ని ఇండియా సెల్యూలార్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ అసోసియేష‌న్ అంచ‌నా వేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా, అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్‌ ఫోన్లను కూడా చేర్చాల‌ని ఇండియా సెల్యూలార్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ అసోసియేష‌న్ కేంద్ర ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మొబైల్‌ పరికరాలతో పాటు ల్యాప్‌టాప్‌లను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చండంటూ హోం శాఖకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ సిఫార్సు కూడా చేసింది.

అయితే కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ నుంచి వెలువ‌డే తుది నిర్ణ‌యంపై అంతా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ నెల 27న పీఎం న‌రేంద్ర మోదీ రాష్ట్ర‌ల ముఖ్య‌మంత్రుల‌తో మ‌రోసారి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా స‌మావేశం అవ‌నున్నారు. ఈ సమావేశంలో అయినా సానుకూల నిర్ణ‌యం వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు, ప్ర‌ముఖ బ్రాండ్ కంపెనీల ముఖ్యుల‌తో పాటు ఫోను వినియోగ‌దారులు.

ఉపాధి కోల్పోనున్న ల‌క్ష‌లాది మంది ఫోన్‌మెకానిక్‌లు..

లాక్‌డౌన్ నుంచి కొత్త ఫోన్ల‌తో పాటు విడివిభాగాల విక్ర‌యాలు, మ‌ర‌మ్మ‌తుల‌కు వెసులుబాటు క‌ల్పించ‌కుంటే దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ఫోన్‌మెకానిక్‌లు ఉపాధి కోల్పోనున్నారు. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక స్వ‌యం ఉపాధి కింద ఫోన్ రిపేరింగ్ నేర్చుకుని జీవ‌నం సాగిస్తున్నారు. గ‌త ఐదు వారాల నుంచి వారు కూడా లాక్‌డౌన్ వ‌ల్ల ఉపాధిని పూర్తిగా కోల్పోయారు.

మ‌రోవైపు పాడైన ఫోన్లు మ‌ర‌మ్మ‌తుల‌కు నోచుకోక‌పోవ‌డంతో స‌మాచార వ్య‌వ‌స్థ పూర్తిగా స్థంభించిపోతోంది. ముఖ్యంగా వ‌ల‌స కూలీల ప‌రిస్థితి దారుణంగా ఉంది. లాక్‌డౌన్‌తో దేశంలో సుమారు నాలుగు కోట్ల‌కు పైగా వ‌ల‌స కూలీలు నిరాశ్రుల‌య్యారు. వీరిలో చాలా మంది పాద‌యాత్ర‌గా త‌మ సొంత ఊర్ల‌కు వెళ్ల‌గా.. మిగిలిన‌వారంతా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ త‌ల‌దాచుకుంటున్నారు. వీరిలో చాలా మంది ఫోన్లు పాడ‌వ‌డంతో త‌మ కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడ‌లేని ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. త‌న ఫోను పూర్తిగా పాడైంద‌ని రిపేర్ చేయించాల‌న్నా ఎక్క‌డా దుకాణం తెరిచిలేద‌ని నోయిడా నుంచి కాన్పూర్ కుటుంబ స‌భ్యుల‌తో వెళుతున్న ఓ వ‌ల‌స కూలీ అమ్రేష్ గోడు ఇలానే వెల్ల‌బుచ్చుకున్నాడు.