విమానయాన రంగంపై PM మోదీ సమీక్ష

భారతదేశ పౌర విమానయాన రంగాన్ని మరింత సమర్ధం గా తీర్చిదిద్దడం లో సహాయకారి కాగల వ్యూహాల ను సమీక్షించడం కోసం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించారు. ప్రయాణాలు చేసే ప్రజలకు విమానాలలో వెచ్చించవలసి వచ్చే కాలం తగ్గి, తద్వారా వారికి ప్రయోజనం చేకూరే విధంగా భారతదేశ గగనతలాన్ని కార్యసాధకంగా వినియోగించ వలసి ఉన్నదని, అలాగే సైన్య వ్యవహారాల విభాగం యొక్క సన్నిహిత సహకారం తో విమాన సంస్థలకు వాటి వ్యయాలను ఆదా చేసుకోవడంలో సాయపడాలని నిర్ణయించడమైంది.

విమానాశ్రయాలలో మరింత సామర్థ్యాన్ని సంతరించడంతో పాటు మరింత ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసం మరో 6 విమానాశ్రయాలను- మూడు నెలలలోగా టెండర్ ప్రక్రియను మొదలుపెట్టడం ద్వారా- పిపిపి ప్రాతిపదికన అప్పగించే ప్రక్రియను త్వరపరచ వలసిందిగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సూచన చేయడమైంది.

సమావేశ క్రమంలో ఇ-డిజిసిఎ పథకాన్ని సైతం సమీక్షించడమైంది. ఈ పథకం డిజిసిఎ యొక్క కార్యాలయం లో మరింత పారదర్శకత్వాన్ని కొనితెస్తుంది. అంతేకాక వివిధ లైసెన్స్/అనుమతుల కోసం పట్టే కాలాన్ని తగ్గించడం ద్వారా సంబంధిత వర్గాలన్నిటికి సహాయకారిగా నిలవనున్నది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఆ శాఖ అధీనంలో గల సంస్థలు అమలు పరచే అన్ని సంస్కరణ కార్యక్రమాలు ఒక కాలబద్ధమైన విధానంలో ముందుకు సాగాలని కూడా నిర్ణయం తీసుకోవడమైంది.ఈ సమావేశానికి హోం మంత్రి, ఆర్ధిక మంత్రి, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి, ఆర్ధిక శాఖ సహాయ మంత్రులతో పాటు భారత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.