సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా. UPSC

ఈ ఏడాది మే 31న జరగాల్సిన UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు వాయిదా వేసారు. దేశంలో లాక్ డౌన్ 3.0 అమలు అవుతుండటంతో మే 20వ తేదీన పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త తేదీలు ప్రకటిస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే UPSC ప్రిలిమ్స్ కోసం లక్షల్లో విద్యార్థులు ప్రిపరేషన్ చేసుకుని పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు కానీ కరోనా మహామ్మారి కారణంగా ఈ వాయిదానిర్ణయాన్ని తీసుకున్నారు.

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ రెండవ దశ తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఈ రోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. లాక్‌డౌన్ పరిమితుల పొడిగింపుల‌ను గమనించి ప్రస్తుతానికి పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు తిరిగి ప్రారంభించుట ఇప్ప‌ట్లో సాధ్యం కాదని కమిషన్ ఒక అభిప్రాయానికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో మే 31 న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షకు స్క్రీనింగ్ పరీక్షగా కూడా పని చేస్తుంది కాబట్టి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా వాయిదా వేయబడింది. మే 20, 2020 న దేశంలో కోవిడ్‌-19 ప‌రిస్థితిని మ‌రోసారి సమీక్షించిన త‌రువాత ఈ పరీక్షల నిర్వ‌హ‌ణ తాజా తేదీల్ని యూపీఎస్‌సీ ఒక నిర్ణ‌యం తీసుకొని త‌న వెబ్‌సైట్‌లో వాటిని స‌మ‌యానుకూలంగా తెలియజేయ‌నుంది.

ఇప్ప‌టికే ప‌లు ప‌రీక్ష‌లు వాయిదా..

కమిషన్ ఇప్పటికే ఈ క్రింది ప‌రాక్ష‌ల‌ను వాయిదా వేసింది: (ఎ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2019 లో మిగిలిన అభ్యర్థులకు వ్యక్తిత్వ పరీక్ష; (బి) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్, 2020; (సి) సంయుక్త వైద్య సేవల పరీక్ష కోసం నోటిఫికేషన్, 2020; (డి) కేంద్ర సాయుధ పోలీసు దళాల పరీక్ష, 2020 మరియు (ఇ) ఎన్డీఏ & నావల్ అకాడమీ పరీక్ష, 2020 కొరకు నోటిఫికేషన్. వాయిదా వేసిన పరీక్షలు / పరీక్షలకు తేదీలు నిర్ణయించబడినప్పుడు, అభ్యర్థులకు కనీసం 30 రోజుల ముందుగా నోటీసు ఇవ్వబడుతుంది.