విశాఖ జిల్లాలో తల్లి రొయ్యల పరిరక్షణ కేంద్రం

విశాఖ జిల్లాలో తల్లి రొయ్యల పరిరక్షణ కేంద్రం
రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు.

న్యూఢిల్లీ, మార్చి 6: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేటలో తల్లి రొయ్యల పరిరక్షణ (బ్రూడర్) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌ చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ రాష్ట్రాంలో వనామి రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఎంపెడా సాంకేతిక సహకారంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ అక్వాకల్చర్‌ సహకారంతో అక్వాటిక్‌ క్వారంటైన్‌ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు తెలిపారు.
వనామీ రొయ్యల సాగులో తల్లి రొయ్యల పెంపకానిది కీలకపాత్ర. ఇందుకోసం తల్లి రొయ్యలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. రోగరహితమైన వనామి రకం తల్లి రొయ్యల పెంపకానికి వినియోగించే జీవద్రవ్యాన్ని దిగుమతి చేసుకుని వాటిని ఇక్కడే వృద్ధి చేసుకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వివరించారు. ఈ కేంద్రం నుంచి నిరాటంకంగా తక్కువ ధరకు తల్లి రొయ్యలను హేచరీలకు సరఫరా చేసే వీలు కలుగుతుంది. అక్వాటిక్‌ క్వారంటైన్‌ విభాగం ఏర్పాటు ద్వారా దిగుమతి చేసుకునే తల్లి రొయ్యలు ఎలాంటి రోగాలకు గురికాలేదని నిర్ధారించుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటు వలన రోగరహితమైన మంచి నాణ్యత కలిగిన రొయ్య పిల్లలను రైతులకు అందుబాటులోకి తీసురావచ్చు. తద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన రొయ్యలను ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అవుతుందని మంత్రి చెప్పారు.
————————————