రాష్ట్రపతి కోవింద్ రేపు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్

దేశంలో కోవిడ్-19 వ్యాప్తి వల్ల తలెత్తిన సంక్షోభాన్ని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రోత్సహించడానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి, భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఏప్రిల్ 3, 2020 అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాల గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లతో ఇటువంటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది రెండవ సారి. 2020, మార్చి 27వ తేదీన జరిగిన మొదటి వీడియో కాన్ఫరెన్సులో 14మంది గవర్నర్లు, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పాల్గొని తమ తమ ప్రాంతాల్లోని అనుభవాలను వివరించారు. మిగిలిన గవర్నర్లు/లెఫ్ట్ నెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు రేపు జరిగే వీడియో కాన్ఫరెన్సులో తమ అనుభవాలు తెలియజేస్తారు.

రాష్ట్రాలలో కోవిడ్-19 పరిస్థితి, అంటువ్యాధుల విభాగాలపై ప్రత్యేక దృష్టితో రెడ్ క్రాస్ పాత్ర, నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి పూర్తి సహకారం అందించడంలో పౌర సమాజం/స్వచ్చంద సంస్థలు/ప్రవేటు రంగం పాత్ర మొదలైన విషయాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించనున్నారు.