ప్రజల రక్షణకు సైనికుల్లా 24X7

దేశంలో కొవిడ్‌-19 మహామ్మారిని అరికట్టే పోరులో తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

ఎవరైనా, ఎప్పుడైనా ఈ అత్యవసర సమయాల్లో ఎదుర్కోవాల్సిన సవాళ్లపై ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. కలిసికట్టుగా ఐక్యమత్యంతో పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు.

రాష్ట్రాల్లో కొవిడ్‌-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా శనివారం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో కరోనా సవాళ్లు, పరిస్థితులను సభ్యులకు వివరించింది. అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాల్లో కరోనా విజృంభన, లాక్ డౌన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభిప్రాయాల్ని ప్రధానితో పంచుకున్నారు. అందరూ ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో లాక్‌డౌన్‌ పొడిగించాలని కోరారు. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సీఎం అమరేందర్‌ సింగ్‌, తెలంగాణ సీఎం KCR లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బిహార్‌ ప్రభుత్వం లేఖ రాసింది.

లాక్ డౌన్ కారణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీలకు మాత్రం మినహాయింపునివ్వాలని రాష్ట్రాలు అభిప్రాయబడ్డాయి. ఇప్పుడు అమల్లోన్న లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనున్న విషయం తెలిసిందే. దేశంలో సాధారణ పరిస్థితుల్ని పూర్తిగా పునరుద్ధరించడం ఇప్పుడప్పుడే కుదరదని PM స్పష్టం చేశారు. దశలవారీగా ఆంక్షల సడలింపు ఉంటుందని సంకేతాలిచ్చారు. తాజాగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగాలని రాష్ట్రాల నుంచి డిమాండ్‌ వచ్చింది.

కరోనా ప్రచారంలో భాగంగా మాస్క్‌ ధరించిన ప్రధాని.
PM నరేంద్ర మోదీ CMs వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మాస్క్‌ ధరించి వీడియో పాల్గొన్నారు. సాధారణ మాస్క్‌ కాకుండా తెల్లటి వస్త్రంతో చేసిన మాస్క్‌ వేసుకున్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే పలువురు ముఖ్యమంత్రులు సైతం మాస్క్‌ ధరించారు. ఇంట్లో తయారు చేసిన రెండు పొరలతో కూడిన మాస్క్‌ను ధరించొచ్చని గత వారం కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నేడు మోదీ మాస్క్‌ను ధరించారు.