కరోనా కట్టడిలో ప్రవేటు భాగస్వామ్యం: AP ఉత్తర్వులు

క‌రోనా వైర‌స్‌ను అడ్డుకోడానికి ప్రైవేటు ఆసుప‌త్రుల సేవ‌ల‌ను వినియోగించుకోనేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌య్యింది. ప్రైవేటు సూప‌ర్ స్పెషాలిటీ, ఇత‌ర ఆసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌లు, న‌ర్సింగ్ హోంల‌ను
ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకువ‌స్తూ AP సర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా తొలి ద‌శ‌లో 450 ఆసుప‌త్రుల‌ను ప్ర‌భుత్వ ప‌రిధిలోకి తీసుకురానున్నారు. అంత‌టితో స‌రిపోకుంటే మున్ముందు ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం లేక‌పోలేదు.

AP ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల మేర‌కు..

ప్రైవేట్‌/ నాన్‌ గవర్నమెంట్‌ మెడికల్, వైద్య ఆరోగ్య సంస్థ‌లు.. అందులో పనిచేసే సిబ్బంది, వసతులు, ఐసొలేషన్‌ పడకలు, గ‌దులు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్‌ ల్యాబొరేటరీలు, ఫార్మసీలు, శవాగారాలు, ఎక్విప్‌మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాల్సి ఉంటుంది.

వ‌స‌తుల వినియోగంలో తొలి ప్రాధాన్యం ప్ర‌భుత్వ ప‌రిధిలోకి వ‌చ్చే వారికే ఉండాలి. కార్పోరేటు, ప్రైవేటు ఆసుప‌త్రుల స్పెష‌లిస్టు డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్, నాన్‌మెడికల్‌ సిబ్బందిని ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు.

కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమ‌ని, చికిత్స అందించేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయించిన‌ట్టు ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌వ‌హర్‌ రెడ్డి తెలిపారు.

తొలిదశలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం తీసుకుంటున్న‌ట్టు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మ‌ల్లికార్జున వెల్ల‌డించారు. విపత్కర సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించవచ్చ‌ని ప్ర‌భుత్వ వైద్యుల సంఘం క‌న్వీన‌ర్ డాక్టర్ జ‌య‌ధీర్‌ తెలిపారు