ఆదిత్యనాథ్ పై ఫైర్ అయిన ప్రియాంకాగాంధీ

ఆదిత్యనాథ్ పై ఫైర్ అయిన ప్రియాంకాగాంధీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై ఆమె విరుచుకుపడ్డారు. సున్నితమైన సమస్యపై సీఎం యోగి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రుల్లో చేర్చుకోలేమంటూ ఆసుపత్రులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… కరోనా పేషెంట్ల కుటుంబీకులు పడుతున్న ఆవేదన యోగికి తెలియడం లేదని అన్నారు. వారి స్థానంలో ఉండి ఆలోచించాలంటూ యోగికి సూచించారు. బాధ్యత లేని ప్రభుత్వాలు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాయని దుయ్యబట్టారు.ముఖ్యమంత్రి గారూ యూపీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ప్రియాంక అన్నారు. ఈ వ్యాఖ్యలను చేసినందుకు తమరు తనపై కేసులు పెట్టాలనుకుంటే… తన ఆస్తులను సీజ్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న విషమ పరిస్థితులను సీఎం అర్థం చేసుకోవాలని… ఒక మెట్టు కిందకు దిగి, పేషెంట్ల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆమె స్పందించారు.