24 గంటలు విద్యుత్ అందించాల్సిందే. కేంద్రం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజున విద్యుత్తు రంగంపై ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని సమీక్షించారు. ఈ రంగం యొక్క సామర్ధ్యాన్ని, పునరుద్ధరణ శక్తిని మరియు సంపోషణీయతను వృద్ధి చేసేందుకు అమలు పరచవలసిన వివిధ దీర్ఘకాలిక సంస్కరణలను కూడా సమావేశంలో ఆయన చర్చించారు.

వ్యాపార నిర్వహణలో సౌలభ్యం, రిన్యూవబుల్స్ గురించి ప్రచారం చేయడం, బొగ్గు సరఫరా లో సారళ్యత, ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యాల పాత్ర మరియు విద్యుత్తు రంగంలో పెట్టుబడికి ప్రోత్సాహాన్ని అందించడం వంటి చర్యలు చర్చలలో చోటు చేసుకొన్నాయి.

ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం లో విద్యుత్తు రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ఒప్పందాలను కట్టుదిట్టంగా ఆచరణలోకి తీసుకురావలసిన ఆవశ్యకత చర్చకు వచ్చింది.

వినియోగదారు కేంద్రిత విధానాలను అవలంబించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని, అలాగే ప్రతి వారంలోనూ ప్రతి రోజూ కూడా 24గంటల పాటు నాణ్యమైనటువంటి మరియు విశ్వాస యోగ్యమైనటువంటి విద్యుత్తును వినియోగదారులందరికి సరఫరా చేసే లక్ష్యాన్ని సాధించే దిశగా శ్రమించాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్తు పంపిణీ కంపెనీల లాభదాయకతను బాగు పరచుకోవడం, ధరల సక్రమ వ్యవస్థీకరణ, సబ్సిడీలను సకాలంలో విడుదల చేయడంతో పాటు మెరుగైన పరిపాలనకు చర్యలను తీసుకోవాలన్న అంశాలను కూడా సమావేశంలో చర్చించడమైంది. ఈ సమావేశానికి హోం మంత్రి, ఆర్ధిక మంత్రి, విద్యుత్తు, నైపుణ్యం మరియు నూతన, ఇంకా నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి, ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ల తో పాటు భారత ప్రభుత్వం లోని ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.