కనిపించిన నెలవంక.. రంజాన్‌ మాసం ఆరంభం

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శుక్రవారం నెలవంక కనిపించడంతో రంజాన్‌ మాసం ప్రారంభమవుతుంది. శనివారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇంట్లోనే నమాజు చేయాలని ముస్లింలకు ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు షాహీ ఇమామ్‌లు సూచించారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా సహకరించాలని కోరారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు బయటికెళ్లి ‘రంజాన్‌’ సామాగ్రిని తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మహ్మదీయుల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్‌ అవతరించిన మాసం రంజాన్‌.

చంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం ఇది తొమ్మిదో నెల. ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు.

సంవత్సరంలో 11 నెలలు సొంతానికి గడిపినా రంజాన్‌ నెలలో మాత్రం దైవ చింతనతో గడపాలని మత గురువులు చెబుతున్నారు.

జీవనోపాధికి చేస్తున్న పనుల్లో నిమగ్నమవుతూ దైవచింతన తప్ప ప్రాపంచిక విషయాల వైపు దృష్టి మరల్చకూడదు. అందుకే ముస్లీంలందరూ రంజాన్‌ నెలలో ఉపవాసదీక్షలు పాటిస్తూ(రోజా) పూర్తిగా త్రికరణశుద్ధితో నిష్కల్మషంగా ఉంటారు. శుక్రవారం నుంచి తరావీహ్‌ నమాజ్‌లు ప్రారంభం కానున్నాయి. శనివారం తెల్లవారుజామునుంచి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు.